Aug 31,2023 00:27

ప్రజాశక్తి-గుంటూరు : ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్‌లో ఖాళీలు చూపించకుండా బ్లాక్‌ చేసిన పోస్టులకు ఇప్పుడు పెద్ద ఎత్తున సిఫార్సు బదిలీలు జరుతున్నాయి. గత వారం రోజులుగా ఈ బదిలీలు ఊపందుకున్నాయి. ప్రతిరోజూ ఒకటి రెండు బదిలీలు జరుగుతూనే ఉన్నాయి. ఉపాధ్యాయులకు సంబంధించి అనేక ఫైళ్లు నెలల తరబడి పెండింగ్‌లో ఉంటున్నా బదిలీలు మాత్రం ఆఘమేఘాలపై జరిపోతున్నాయి.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో సుమారు ఇప్పటి దాకా 25 మందికి సిఫార్సు బదిలీలు చేసినట్లు సమాచారం. తాడికొండ, నంబూరు, తెనాలి, మేడికొండరూ, కొల్లిపర మండలాల్లో ఆయా ఉపాధ్యాయులు చేరినట్లు తెలిసింది. కాగా వీటి కోసం డబ్బులు పెద్ద ఎత్తున చేతులు మారుతున్నాయని ఉపాధ్యాయుల్లో ప్రచారమవుతోంది. ఒక్కొక్క పోస్టుకు రూ.3 లక్షల నుండి రూ.5 లక్షలు కూడా సమర్పించుకుంటున్నారు. నేరుగా మంత్రుల నుండే ఉత్తర్వులు తెచ్చుకుంటున్నారు. గతంలో ఈ విధమైన బదిలీల కోసం ఎక్కువ రోజుల సమయం పట్టేదని, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఉదయం వెళ్లి కలిసి డబ్బులు కడితే రెండ్రోజుల్లో పోస్టింగ్‌ ఇస్తున్నారని అనుకుంటున్నారు. అటువంటి ఉపాధ్యాయులకు అధికారులు కూడా రెడ్‌కార్పెట్‌ వేసి మరీ కోరుకున్న స్థానాల్లో పోస్టింగ్‌ ఇస్తున్నారనే విమర్శలున్నాయి. అక్రమంగా బదిలీలు పొందిన వారు డిఇఒ కార్యాలయంలోనే తమ ఆనందాన్ని మిఠాయిలు పంచుకొని వ్యక్తం చేసుకుంటున్నారు.
రెండ్రోజుల క్రితం వట్టిచెరుకూరు మండలంలో ఒక చోటకు ఏడుగురు ఉపాధ్యాయులకు సిఫార్సు లేఖలు వచ్చాయి. దీంతో ఎవరికి పోస్టింగ్‌ ఇవ్వాలో తేల్చలేకపోతున్నారు. ఇటీవల ఉపాధ్యాయులకు బదిలీల కౌన్సెలింగ్‌ అయిన తర్వాత ఖాళీలలో ఎంటిఎస్‌ ఉపాధ్యాయులకు పోస్టింగ్‌ ఇచ్చారు. ఇప్పుడు సిఫార్సు బదిలీల్లో అవసరమైతే ఎంటిఎస్‌ ఉపాధ్యాయులనూ పక్కన పెట్టి రెగ్యులర్‌ టీచర్లకు పోస్టింగ్స్‌ ఇస్తున్న ఘటనలు చోటు చేసుకున్నాయి. అదే విధంగా కౌన్సెలింగ్‌లో దూర ప్రాంతాలకు బదిలీ అయిన వారు సైతం కొందరు ఇప్పుడు జిల్లా కేంద్రం చుట్టుపక్కన పోస్టింగ్‌ తెచ్చుకుంటున్నారు. ఇంత అడ్డగోలుగా గతంలో ఎప్పుడూ లేదని ఉపాధ్యాయులు అంటున్నారు. కౌన్సెలింగ్‌ విధానానికి తూట్లు పొడిచే విధంగా రాజకీయ బదిలీలు చేస్తున్న విధానాన్ని ఉపాధ్యాయ సంఘాలు తప్పుబడుతున్నాయి.
తక్షణమే ఆపాలి
ఎం.కళాధర్‌, యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి.

సిఫార్సు బదిలీలు తక్షణమే ఆపాలి. ప్రభుత్వం కౌన్సెలింగ్‌ విధానానికి తూట్లు పొడిచి, కొంత మంది కోసం వేలాది మంది ఉపాధ్యాయులను మోసం చేయటం తగదు. ఈ బదిలీల పట్ల ఉపాధ్యాయుల్లో పెద్ద ఎత్తున ఆందోళన నెలకొంది. ఇటువంటి అప్రజాస్వామిక చర్యలకు ఇప్పటికైనా స్వస్థి పలకకుంటే ఆందోళనకు పూనుకుంటాం.