May 13,2023 23:58

ప్రదర్శనను తిలకిస్తున్న విసి ప్రసాదరెడ్డి

ప్రజాశక్తి-ఎంవిపి.కాలనీ : ఆంధ్రవిశ్వవిద్యాలయం విద్యార్థులు సృజనశీలురని ఆంధ్రవిశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య పివిజిడి ప్రసాదరెడ్డి అన్నారు. శనివారం ఉదయం ఏయూ చిత్రకళా విభాగంలో బిఎఫ్‌ఎ, ఎంఎఫ్‌ఎ విద్యార్థుల వార్షిక చిత్ర, శిల్పకళా ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారుచేసిన శిల్పాలు, వర్ణచిత్రాలను ఎంతో ఆసక్తిగా తిలకించారు. చిత్రం వెనుక ఉన్న ఆలోచనలను విద్యార్థులనడిగి తెలుసుకున్నారు. క్లే, బ్రాస్‌, విభిన్న మాధ్యమాలతో తీర్చిదిద్దిన చిత్రాలు, శిల్పాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం వీసీ ఆచార్య ప్రసాద రెడ్డి మాట్లాడుతూ, వర్సిటీ చిత్రకళ విభాగం విద్యార్థులు ఎంతో ప్రతిభావంతులన్నారు. విశ్వవిద్యాలయాన్ని మరింత కళాత్మకంగా తీర్చిదిద్దడంలో వీరి ప్రతిభను ప్రోత్సహిస్తామన్నారు. ఈ ప్రదర్శనను వర్సిటీలోని విభిన్న విభాగాల విద్యార్థులు తిలకించేలా ప్రోత్సహిస్తామన్నారు. విద్యార్థులకు మానసిక ప్రశాంతత, ఒత్తిడి నుంచి ఉపశమనం అందించే విధంగా చిత్రలేఖనం నిలుస్తుందన్నారు. విద్యార్థులు ఎంతో ప్రతిభతో తీర్చిదిద్దిన కళారూపాలు అందరి మనసులను దోచుకుంటాయన్నారు. కార్యక్రమంలో రెక్టార్‌ ఆచార్య కె.సమత, ప్రిన్సిపల్‌ ఆచార్య ఎ.నరసింహారావు, విభాగాధిపతి సింహాచలం, ఆచార్య వి.రమేష్‌, విశ్రాంత ఆచార్యులు, పరిశోధకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.