
ప్రజాశక్తి - ధర్మవరం టౌన్ : ప్రతి విద్యార్థి సైంటిఫిక్ జీవన విధానాన్ని అలవరచుకోవాలని జేవీవీ జిల్లా ప్రధానకార్యదర్శి డాక్టర్ ఆదిశేషు సూచించారు. స్థానిక సూర్యపాఠశాలలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక చెకుముకి సైన్స్ సంబరాలకు సంబంధించిన గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆదిశేషు మాట్లాడుతూ 33సంవత్సరాలుగా జేవీవీ విద్యార్థులలో సైంటిఫిక్ ఆలోచనను కలిగించి వాటి జీవన విదానాన్ని అలవరుచుకునేందుకు కృషిచేస్తోందన్నారు. అందులో భాగంగా విద్యార్థులలో సైన్సు పట్ల ఇష్టాన్ని కల్గించడానికి ఆలోచనా శక్తిని పెంచడానికి జన విజ్ఞానవేదిక పనిచేస్తోందన్నారు. నవంబరు 10న పాఠశాలస్థాయి, 30న మండలస్థాయి, డిసెంబరు 17న జిల్లాస్థాయి, జనవరి 27న 28తేదీలో రాష్ట్రస్థాయిలో పోటీలు నిర్వహిస్తామన్నారు. ఈ చెకుముకి టెస్టులో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో 8,9,10 తరగతులు చదివే విద్యార్థులకు నిర్వహించాలని రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. జిల్లాలో అధికారులు, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థుల విద్యాభివృద్ధికి జేవీవీ చేస్తున్న కృషికి సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జేవీవీ జిల్లా గౌరవాధ్యక్షులు వాసుదేవరెడ్డి, జిల్లా అధ్యక్షులు మహేంద్రరెడ్డి, రాష్ట్ర ఆడిట్ కన్వీనర్ భాస్కర్, నాయకులు హరి, రాజశేఖర్, బాలగంగాధర్‌నాయక్, లక్ష్మీనారాయణ, ఇమ్రాన్, నరేంద్రబాబు, లాయర్ హరిప్రసాద్, లోకేశ్, సురేశ్, రామాంజినేయులు, పర్వతయ్య తదితరులు పాల్గొన్నారు.