ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్ విద్యార్థులు ఇప్పటి నుంచే శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలని, అప్పుడే మూఢవిశ్వాసాలు లేని సమాజాన్ని నిర్మించుకోవచ్చని జెవివి నాయకులు, జనరల్ సర్జన్ డాక్టర్ కొండయ్య సూచించారు. మంగళవారం జెవివి ఆధ్యర్యంలో నగరంలోని నవోదయ కాలనీ గిరిజన గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్ అర్జున్ నాయక్ అధ్యక్షతన సైంటిటిఫిక్ టెంపర్ డే క్యాంపెన్ సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు సి.వి.రామన్ జయంతి అన్నారు. శాస్త్ర విజ్ఞాన రంగంలో మొట్టమొదటి నోబెల్ బహుమతి, భారతరత్న అందుకొన్న వ్యక్తి అన్నారు. మానవుని యెక్క ప్రగతి శాస్త్ర విజ్ఞానం అభివృద్ధిలో కనపడుతుందిని, కావున పాలకులు శాస్త్రీయ విజ్ఞాన అభివద్ధికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. జెవివి జిల్లా గౌరవాద్యక్షురాలు డాక్టర్ ప్రసూన మాట్లాడుతూ నేటి సమాజంలో పాలకులు నిజమైన శాస్త్ర సాంకేతిక అభివద్ధికి కాకుండా యాంటీ సైన్స్, సూడో సైన్స్‌కు ప్రాధాన్యత నిస్తున్నాయని తెలిపారు. మేడం క్యూరి జన్మించిన రోజు కూడా ఈరోజేనని ఎన్నో అడ్డంకులు దాటుకొని ఫిజిక్స్, కెమిస్ట్రీ రెండిటిలో నోబెల్ బహుమతి పొందిన మొదటి మహిళ ఆమెనే అన్నారు. యాంటీ సైన్స్, సూడో సైన్స్ వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈనెల 7వతేదీ నుంచి నుంచి దేశవ్యాప్తంగా అల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్‌వర్క్ ఆధ్వర్యంలో సైన్స్ ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమలో జెవివి నగర అధ్యక్ష కార్యదర్శులు విజయలక్ష్మి, గాంగే నాయక్, నాయకులు రామిరెడ్డి, వీరరాజు, లక్ష్మినారాయణ, ప్రసాద్ రెడ్డి, ప్రసాద్, నవీన్ కుమార్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.