విద్యార్థులు శాస్త్రవేత్తలుగా రాణించాలి ఎస్‌జిఎస్ షార్ స్పేస్ ఎగ్జిబిషన్‌లో సదా భార్గవి
విద్యార్థులు శాస్త్రవేత్తలుగా రాణించాలి
ఎస్‌జిఎస్ షార్ స్పేస్ ఎగ్జిబిషన్‌లో సదా భార్గవి
ప్రజాశక్తి - క్యాంపస్
టిటిడి విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులు అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన పెంచుకుని, ఆసక్తిగల వారు శాస్త్రవేత్తలుగా రాణించాలని టిటిడి జేఈవో సదా భార్గవి పిలుపు నిచ్చారు. ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల్లో భాగంగా శ్రీగోవిందరాజస్వామి ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన స్పేస్ ఎగ్జిబిషన్‌ను జేఈవో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రీవారి ఆశీస్సులతో టిటిడిలోని 33 విద్యాసంస్థల్లో 29 వేల మంది విద్యార్థులు వివిధ రకాల విద్యను అభ్యసిస్తున్నారని తెలియజేశారు. అంతరిక్ష పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తల కషిని అభినందించారు. టిటిడి పాఠశాలల్లో చదివే విద్యార్థులందరూ శ్రీహరికోటలోని షార్‌ను సందర్శించేందుకు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సందర్భంగా చంద్రయాన్-3 పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు. ఈ పోస్టరును విద్యార్థులందరూ తమ ఇళ్లలో అంటించుకుని స్ఫూర్తిని పొందాలని సూచించారు. టిటిడి విద్యార్థులకు షార్‌లో ఇంటర్న్ షిప్ తోపాటు తగిన ఉద్యోగావకాశాలు కల్పించాలని షార్ అధికారులను కోరారు. టిటిడి విద్యార్థులు మన సంస్కతి సంప్రదాయాల పట్ల అవగాహన పెంచుకుని విద్యార్థి దశ నుంచే వాటిని పాటించాలన్నారు. టిటిడి విద్యాశాఖ అధికారి డాక్టర్ ఎం.భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల ప్రాధాన్యతను వివరించారు. మొదటి మానవ నిర్మిత ఉపగ్రహం గురించి తెలియజేశారు. విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని వీక్షించి స్ఫూర్తిని పొందాలని, శాస్త్రీయ దక్పథాన్ని పెంపొందించు కోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో షార్ సీనియర్ సైంటిస్ట్ శంభుప్రసాద్, షార్ గ్రూప్ డైరెక్టర్ గోపికష్ణ, షార్ టెస్ట్ ఫెసిలిటీస్ మేనేజర్ డాక్టర్ టి.శ్రీనివాసరెడ్డిలు శ్రీహరికోటలో జరిగే ప్రయోగాలన్నింటినీ ఈ ప్రదర్శనలో ఉంచామని, విద్యార్థులు శ్రద్ధగా తిలకించి అర్థం చేసుకోవాలని సూచించారు. షార్ నిర్వహించిన క్విజ్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన 24 మంది టీటీడీ విద్యార్థులకు జేఈవో బహుమతులు ప్రదానం చేశారు. అతిథులను సన్మానించారు. టిటిడి పాఠశాలల్లోని 8, 9, 10వ తరగతులకు చెందిన సుమారు 1400 మంది విద్యార్థులు ఎగ్జిబిషన్‌ను తిలకించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు చంద్రయ్య, కష్ణమూర్తి, సురేంద్ర, పద్మావతమ్మ, సంధ్య పాల్గొన్నారు.










