Mar 30,2023 23:56

మాట్లాడుతున్న జెడ్‌పిటిసి

ప్రజాశక్తి-గొలుగొండ:విద్యార్ధులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని పట్టుదలతో చదవాలని గొలుగొండ జెడ్పీటీసీ సుర్ల గిరిబాబు సూచించారు. గురువారం మండలంలోని చీడిగుమ్మల జడ్పీ హైస్కూల్‌ ఫేర్వెల్‌ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన జెడ్పీటీసీ మాట్లాడుతూ మానవ జీవితంలో 14 నుంచి 20 ఏళ్ల వయసు చాలా కీలకమైనదన్నారు. ఎవరైతే ఈ దశలో మనసును అదుపులో ఉంచుకొని ఆలోచనలను మంచి మార్గం వైపు నడిపించుకుంటారో వారికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందన్నారు. ఈ వయసులోనే పిల్లల ప్రవర్తనను జాగ్రత్తగా గమనించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపై ఉందన్నారు. విద్య, విద్యార్థులకు సౌకర్యాలు కల్పించడం పట్ల సిఎం జగన్‌ చిత్తశుద్ధిని కనబరుస్తున్నారని కొనియాడారు. నాడు నేడుతో మార్పులు తీసుకొచ్చి విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి పెరిగే విధంగా చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జివిఎస్‌.నాగేంద్ర, సర్పంచ్‌ కాపారపు చినబాబు, ఎంపిటిసి లెక్కల అప్పలనాయుడు, విద్యా కమిటీ చైర్మన్‌ చింతల అప్పలనాయుడు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.