ప్రజాశక్తి - ఏలూరు
స్వతంత్ర పోరాటంలో మహనీయుల త్యాగాలు ప్రతి విద్యార్థి తెలుసుకోవాలని సుబ్బమ్మదేవి హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు పి.కుటుంబరావు అన్నారు. ఎవిఆర్ విజ్ఞాన కేంద్రం తరపున తొమ్మిదో తేదీ నుంచి 15వ తేదీ వరకు విద్యాలయాల్లో నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగా 12వ తేదీ పోటీల ఫ్లెక్సీని సుబ్బమ్మ దేవి హైస్కూల్ హెడ్‌మాస్టర్ కుటుంబరావు ఆవిష్కరించారు. ఎవిఆర్ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి గుడిపాటి నరసింహరావు మాట్లాడుతూ 9, 10, 11 తేదీల్లో హైస్కూల్, కాలేజీల్లో వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. 12వ తేదీన హైస్కూల్ విద్యార్థులకు ఉపన్యాస పోటీ కాలేజీ విద్యార్థులకు క్విజ్ పోటీలు సుబ్బమ్మ దేవి హైస్కూల్లో నిర్వహిస్తామని, ఈ పోటీలకు హైస్కూల్ నుంచి ముగ్గురు చొప్పున, కాలేజీ నుంచి గ్రూపునకు ముగ్గురు చొప్పున రెండు గ్రూపులు పాల్గొనవచ్చన్నారు. విజేతలందరికీ 15వ తేదీన సీతారామ భర్తీయా కళ్యాణ మండపం చాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో నిర్వహించే సభలో బహుమతులు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎవిఆర్ విజ్ఞాన కేంద్రం కమిటీ సభ్యురాలు జి.శారద, ఉపాధ్యాయులు ఆర్‌విఆర్‌కె.వరప్రసాద్, కె.శ్వేత, ఎన్.లీలాకుమారి, పి.గోపాల్ పాల్గొన్నారు.










