ప్రజాశక్తి -పిఎం పాలెం : ప్రతి విద్యార్థీ ఇష్టంతో చదువుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున కోరారు. కొమ్మది రిక్షాకాలనీ సమీపంలో ఉన్న డాక్టర్ బిఆర్.అంబ్కేర్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల ప్రతిభా పాఠశాల, కళాశాలను శనివారం ఆయన సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడారు. వారి సమస్యలనడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. నాడు-నేడు, అమ్మఒడి, విద్య, వసతి దీవెన తదితర కార్యక్రమాలను అమలుచేస్తున్నారన్నారు. రెసిడెన్షియల్ స్కూల్స్, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్‌ను నాడు నేడు పథకం ద్వారా మరమ్మతులు చేస్తున్నట్లు తెలిపారు. పిల్లలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని మెనూలో మార్పులు చేస్తున్నట్లు చెప్పారు. క్వాలిటీ, క్వాంటిటీ ఫుడ్, గుడ్ ఎడ్యుకేషన్, ఇంగ్లీష్ విద్య, సిబిఎస్‌ఇ సిలబస్ తదితర సరికొత్త విద్యా విధానాలను ముఖ్యమంత్రి ప్రవేశపెట్టారన్నారు. ప్రతి పాఠశాల లైబ్రరీలలో దిన పత్రికలు ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. వైసిపి అభివృద్ధిని చూసి ఓర్వలేక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అసహనం వ్యక్తంచేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ గురుకులాల జిల్లా డైరెక్టర్ రమణమూర్తి, డిసిఒ ఎస్.రూపావతి తదితరులు పాల్గొన్నారు.










