Feb 27,2023 21:57

ప్రజాశక్తి - భీమడోలు
              విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.రాజేశ్వరి కోరారు. భీమడోలు హైస్కూల్లో సోమవారం న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. కార్యక్రమానికి భీమడోలు బార్‌ అసోషియేషన్‌ అధ్యక్షులు విజయరాజు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా రాజేశ్వరి మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం పలు చట్టాలు చేసిందన్నారు. విద్యార్థులకు మంచి స్పర్శ, చెడుస్పర్శ మధ్య గల తేడాలను వివరించారు. బాలలు ఎవరికైనా ఇబ్బంది కలిగితే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. విచారణ సందర్భంగా బాలలకు ఏర్పాటు చేసే రక్షణ, విచారణ తీరు, కొన్ని అంశాల నుంచి వారికి ఇచ్చే మినహాయింపులను వివరించారు. ఈ నేపథ్యంలో మాదక దవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాలు, వాటి పరిణామాల గురించి వివరించారు. విద్యార్థుల హక్కుల. గురించి తెలిపారు. లైంగిక వేధింపులు, ఇతర అంశాల సందర్భంగా చట్టం నుండి రక్షణ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు విజయరాజు, విద్యార్థులు చట్టం పట్ల అవగాహన కలిగి ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో భీమడోలు సిఐ వి.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.