
ప్రజాశక్తి - పంగులూరు
విద్యార్థులంతా ఆరోగ్యంగా జీవిస్తే దేశం ఆరోగ్యవంతంగా ఉంటుందని ప్రజారోగ్య వేదిక జిల్లా కన్వీనర్ డాక్టర్ కె రఘుచంద్ అన్నారు. స్థానిక జెడ్‌పి ఉన్నత పాఠశాల విద్యార్థిని, విద్యార్థులతో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జంక్ ఫుడ్, బయట ఆహారాలు తినటం ద్వారా ఆనారోగ్యం పాలౌతారని సూచించారు. ఇంటి ఆహారాలు మాత్రమే తింటే ఆరోగ్యం బాగుంటుందని చెప్పారు. హోమియోలో జలుబు, తలనొప్పి, దగ్గు, కడుపు నొప్పి మొదలైన వాటితో పాటు బాలికలకు వచ్చే పీరియడ్స్ కు సంబంధించి మంచి వైద్యం ఉందని చెప్పారు. హోమియో మందుల ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందాలని అన్నారు. బాచిన సుబ్బారావు కుమారుడు ఎన్నారై మహేష్ సహకారంతో ఏడాది పాటు విద్యార్థులకు అవసరమయ్యే అన్ని రకాల హోమియో మందులను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం విద్యార్థులను పరీక్షించి మందులు అందజేశారు. కార్యక్రమంలో హెచ్‌ఎం రమాదేవి, ఉపాధ్యాయులు శ్రీగిరి శ్రీనివాసరావు, బాచిన నారాయణరావు, దుర్గాప్రసాద్, భాస్కర మూర్తి, ఎస్‌విడివి ప్రసాద్, సిహెచ్ వసుంధర దేవి పాల్గొన్నారు.