ప్రజాశక్తి- శృంగవరపుకోట : రాష్ట్రంలో ప్రయివేటు, ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో విద్యను బోధిస్తున్న ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్ధులకు నైతిక విలువలు నేర్పడంతో పాటు వారితో స్నేహ పూర్వకంగా ఉండాలని, రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్ పర్సన్ కేసలి అప్పారావు తెలిపారు. ఈ నెల 16న మండలంలోని కిల్తం పాలెం జవహర్ నవోదయ విద్యాలయంలో హర్యానాకు చెందిన విద్యార్ధులపై వ్యాయామ ఉపాధ్యాయుడు శారీరక దండనకు పాల్పడ్డారని వారి తల్లి దండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ రాష్ట్రానికి సంబందించిన కలెక్టర్, మన జిల్లా కలెక్టర్‌కు, జిల్లా బాలల సంక్షేమ సమితి వారికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా సిబ్బందితో కలిసి నవోదయ విద్యాలయాన్ని కేసలి అప్పారావు మంగళవారం సందర్శన చేశారు. బాధిత హర్యానా విద్యార్థులతో, వ్యాయామ ఉపాధ్యాయుడుతో, ఉపాధ్యాయ సిబ్బందితో కలిసి జరిగిన సంఘటనపై ఆరా తీశారు. ఈ సందర్భంగా అప్పారావు మాట్లాడుతూ బాలల న్యాయచట్టం ప్రకారం ఉపాధ్యాయులు, సిబ్బంది విద్యార్ధులపై శారీరక దండనకు పాల్పడితే వారిపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జరిగిన సంఘటన పై ఒక నివేదికను వారం రోజుల్లో సమర్పించాలని ప్రిన్సిపల్‌కి ఆదేశాలు జారీచేశారు. కేంద్రంలోని డార్మేటరి, వంట గదులను, తరగతి గదులను పరిశీలించారు. కేంద్రంలో శిధిలావస్థలో ఉన్న తరగతి, వసతి గదులను, రక్షణ గోడను తక్షణమే తిరిగి పునర్మించాల్సిన ఆవశ్యకత ఉందని ప్రిన్సిపాల్ కమిషన్ ఛైర్మన్‌ను కోరారు. దీని వల్ల విద్యాలయంలోకి ఇతరులు, పశువులు చొరబడుతున్నావని, తక్షణ పరష్కారం కోసం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యాలయం ప్రిన్సిపల్ వి. దుర్గ ప్రసాద్, జిల్లా బాలల సంరక్షణ విభాగం సిబ్బంది కెంగువ జయలక్ష్మి, యాళ్ల నాగరాజు, వెన్నెల సంధ్య తదితరులు పాల్గొన్నారు.










