Dec 27,2022 21:58

ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
            ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నాడు - నేడు పథకం పనులకు విద్యార్థులను వినియోగిస్తూ వారితో వెట్టిచాకిరీ చేయిస్తున్న ఘటన పలువురిని విస్మయానికి గురిచేస్తుంది. పాఠాలు నేర్చుకోవాల్సిన విద్యార్థులు పారపట్టి మట్టిని మోస్తూ కనిపించారు. మంగళవారం మండలంలోని లక్కవరం ఎంపిపి పాఠశాల-1లో వెలుగు చూసిన ఈ సంఘటనపై పలువురు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలను చదువుకునేందుకు బడికి పంపితే వెట్టిచాకిరీ చేయిస్తున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులతో పనులు చేయించడంపై ఎంపిపి కొదమ జ్యోతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి మందలించారు. అయినప్పటికీ ఆ ప్రధానోపాధ్యాయుని తీరు మారకపోవడం దారుణమని స్థానికులు పేర్కొంటున్నారు. అలాగే ఎంపిపి పాఠశాల-1లో జరిగిన నాడు-నేడు పనులపై విచారణ జరపాలని పలువురు కోరుతున్నారు అక్రమాలతో పాటు విద్యార్థులతో పనులు చేయించి కూలి రేట్లు జమా ఖర్చులు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనపై ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. దీనిపై ఎంఇఒ బి.రాముడిని వివరణ కోరగా విద్యార్థులతో వెట్టిచాకిరీ చేయిస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందని తెలిపారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.