* నేడు డీ వార్మింగ్ డే
* 17న మాప్ అప్ డే
* జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి బి.మీనాక్షి
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: డీ వార్మింగ్ డేలో భాగంగా జిల్లాలోని అన్ని అంగన్వాడీ, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లోని విద్యార్థులకు నులిపురుగుల నిర్మూలన మాత్రలు పక్కాగా వేయించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి బి.మీనాక్షి అన్నారు. జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. నులిపురుగుల నివారణ మాత్రలు తీసుకోవడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవని స్పష్టం చేశారు. విద్యార్థుల్లో అపోహను తొలగించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒలు, ఆరోగ్య కార్యకర్తలు , ఆశావర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, స్వచ్ఛంద సేవా సంస్థలు భాగస్వాములు కావాలన్నారు. మాత్రలు తీసుకోకుండా మిగిలి ఉన్న వారికి 17న మాప్ అప్ డే నిర్వహించనున్నట్టు తెలిపారు. విద్యార్థులకు డీవార్మింగ్ మాత్రలు (ఆల్బెండాజోల్ 400 ఎంజి) తప్పనిసరిగా నమిలించి మింగించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో 1 నుండి రెండేళ్ల వరకు సగం మాత్ర, 3 నుంచి 19 ఏళ్ల విద్యార్థులతో పాటు పాఠశాలలకు వెళ్లని పిల్లలకు అంగన్వాడీ కార్యకర్తల ద్వారా మాత్రలు వేయించాలన్నారు. ప్రతి పాఠశాలలో ఉదయం 8 గంటలనుంచి సాయంత్రం 5 వరకు నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. మధ్యాహ్న భోజనం తర్వాత ప్రతి విద్యార్థికి వైద్యారోగ్య, విద్యా శాఖ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తల సమన్వయంతో నమిలి తినిపించాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్న, బడికి వెళ్లని పిల్లలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న మొత్తం 4,44,162 మందికి మాత్రలు పంపిణీ చేశామని వివరించారు. సమావేశంలో రాష్ట్రీయ బాల స్వాస్థ్య జిల్లా సమన్వయకర్త సి.పి శ్రీదేవి, మాస్ మీడియా అధికారి పైడి వెంకటరమణ, ప్రోగ్రాం మేనేజర్ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.










