ప్రజాశక్తి - చేబ్రోలు : వేసవి వినోదం పేరుతో బాల బాలికలకు సిఐటియు, యుటిఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో క్రాఫ్ట్, మ్యాజిక్, పాటలు కోలాటం తదితర అంశాల్లో పిల్లలకు నిర్వహిస్తున్న శిక్షణను మండల కేంద్రమైన చేబ్రోలులోని షాదీఖానాలో బుధవారం ప్రారంభించారు. కాగితాలతో బొమ్మల తయారీ, సంగీతంపై అవగాహన కల్పించారు. శిక్షణానంతరం ఈరోజు నేర్చుకున్న బొమ్మలతో పిల్లలకు మ్యాజిక్ ట్రిక్స్ నేర్పించారు. ఈ సందర్భంగా జనవిజ్ఞాన వేదిక జిల్లా నాయకులు వి.ప్రసాద్‌రావు మాట్లాడుతూ మూఢనమ్మకాలను వదిలివేసి, శాస్త్రీయ అవగాహనతో ముందడుగు వేయాలని సూచించారు. చిన్నపిల్లలు గ్రహణ శక్తి, పరిశీలనా శక్తి ఎక్కువగా ఉంటుందని, దానిని అభివృద్ధి చేస్తే ఆణిముత్యాలుగా తయారవుతారని చెప్పారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు డి.లక్ష్మీనారాయణ, యుటిఎఫ్ మండల కార్యదర్శి నాగేశ్వరరావు, జెవివి నాయకులు వేణుగోపాలరావు పాల్గొన్నారు.
ప్రజాశక్తి - నరసరావుపేట : విద్యార్థులలో దాగివున్న సృజనాత్మకతను వెలికితీయడంతో పాటు విజ్ఞానం పంచేందుకు వేసవి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసినట్లు పల్నాడు విజ్ఞాన కేంద్రం భాద్యులు, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ముజఫర్ అహమ్మద్ అన్నారు. పల్నాడు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో స్థానిక గుంటూరు రోడ్డు నిమ్మతోట సిల్మన్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో నిర్వహిస్తున్న బాలల ఉచిత వేసవి శిక్షణ శిబిరాలు రెండవ రోజు కార్యక్రమంలో విద్యార్థులకు చేతి రాతపై పోటీలు నిర్వహించి ప్రతిభ చూపిన వారికి నోటు పుస్తకాలు, పెన్నులను ఉపాధ్యాయులు షేక్ జున్ను సాహెబ్ అందించారు. విజ్ఞాన కేంద్రం కార్యక్రమాల కన్వీనర్ షేక్ మస్తాన్‌వలి మాట్లాడుతూ గురువారం స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. కార్యక్రమంలో లిమ్రా హ్యాండ్ రైటింగ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ షేక్ కరీముల్లా, విజ్ఞాన కేంద్రం భాద్యులు కె.రామారావు, నాగేశ్వరరావు, ఎస్‌ఎమ్‌డి హుస్సేన్, ఉపాధ్యాయులు శిరీష, డి.సుభాష్‌చంద్రబోస్ పాల్గొన్నారు.










