Dec 22,2022 23:45

గిరి విజ్ఞాన సంబరాలను ప్రారంభిస్తున్న పిఒ

ప్రజాశక్తి-పాడేరు టౌన్‌: గిరిజన విద్యార్థుల్లో దాగివున్న సృజనాత్మకతను వెలికి తీయాలని ఐటిడిఎ పిఒ రోణంకి గోపాలకృష్ణ సూచించారు. అల్లూరి జిల్లా కేంద్రం పాడేరులో లోచలి పుట్టు జిటిడబ్ల్యూ ఆశ్రమ పాఠశాలలో ( నెంబర్‌-1 స్కూల్‌ )లో గురువారం ఆయన జోనల్‌ స్థాయి గిరి విజ్ఞాన సంబరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గతేడాది కంటే మిన్నగా ఈ ఏడాది రూ.32 లక్షల వ్యయంతో గిరి విజ్ఞాన సంబరాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. గిరి విజ్ఞాన సంబంరాల్లో క్రీడలు నిర్వహించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ఎక్కడా జరగని విధంగా విజ్ఞాన సంబరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇటీవల గిరిజన విద్యార్థులను శ్రీహరి కోటకు విజ్ఞాన యాత్రకు పంపించామని చెప్పారు. విద్యావంతులైన గిరిజన యువతీ, యువకులకు వేపగుంట వైటిసిలో సివిల్స్‌ కోచింగ్‌ అందిస్తున్నామన్నారు. గిరిజన విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఐటిడిఎ నుండి సహకారం అందిస్తున్నామని తెలిపారు. అనంతరం విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శనలు తిలకించారు. పాడేరు, హుకుంపేట, జి.మాడుగుల మండలాల్లోని 37 పాఠశాలల నుంచి 6 సబ్జెక్టులకు సంబంధించి 207 నమూనాలు తయారు చేసి ప్రదర్శించారు. వీటిలో కొన్ని నమూనాలను ఈనెల 28, 29, 30 తేదీలలో తలారిసింగి జిటిడబ్ల్యూ ఆశ్రమ పాఠశాలలో ఐటిడిఎ స్థాయి గిరిజన విజ్ఞాన సంబరాలకు ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.