ప్రజాశక్తి హుకుంపేట:విద్యార్థులను పూర్తిస్థాయిలో విజ్ఞాన వంతులుగా తీర్చిదిద్దాలని జిల్లా విద్యాశాఖ అధికారి పి.రమేష్ సూచించారు. మండలంలోని స్థానిక ట్రైబల్ వెల్ఫేర్ బాలుర పాఠశాలలో ఉపాధ్యాయుల శిక్షణ తరగతులను జిల్లా విద్యాశాఖ అధికారి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ, పిల్లలకు తెలుగులో రాయడం, పదాలు చదవడం, వాక్యాలు రాయడం నేర్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు.విద్యార్థులకు విద్య పట్ల నైపుణ్యం పెంపొందించడం కోసం ప్రత్యేకంగా తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. విద్యార్థులకు తెలుగు, గణితం సబ్జెక్టులో పట్టు సాధించే విధంగా నేర్పించాలని ఉపాధ్యాయులకు ఆయన సూచించారు. గ్రామస్థాయిలో డ్రాప్ అవుట్స్ లేకుండా చూడాలన్నారు. ఆట పాటలతో కూడిన విద్యా, పిల్లలకు బడులు అలవాటు చేసే విధంగా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి ఎస్.రామచంద్రరావు, మండల విద్యాశాఖ కోఆర్డినేటర్ వి.విజయరాజు, రిసోర్స్ పర్సన్, సీఆర్పీలు సిబ్బంది పాల్గొన్నారు.










