ప్రజాశక్తి -యంత్రాంగం వేసవి శిబిరాల్లో భాగంగా ఆదివారం పలుచోట్ల విద్యార్థులకు వైజ్ఞానిక కార్యక్రమాలు నిర్వహించారు. కరప వేసవి వినోదంలో విద్యార్థులు విజ్ఞానాన్ని సమకూర్చుకుంటున్నారని జెవివి జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్లమూరి శ్రీ రామారావు అన్నారు. వాకాడలో 22 రోజులుగా నిర్వహిస్తున్న వేసవినోదంలో భాగంగా ఆదివారం గణితంలో మెళకువలు, ఒరిగామి, సైన్స్ ప్రయోగాలు, పప్పెట్రీ, కథలు చెప్పించడం, మ్యాజిక్ నేర్పించడం, భాషాంశాలు మొదలైన అంశాలతో విద్యార్థులు విజ్ఞానం, వికాసం, వినోదంతో సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ నిర్వహణ జరుగుతుంది. ఈ కార్యక్రవమంలో గ్రామ సర్పంచ్ అడబాల సత్య ప్రసాద్, విద్యాభిలాషి ఆకుల బాపనయ్య పాల్గొన్నారు. పెద్దాపురం గ్రంథాలయంలో కోటపాడు ఉపాధ్యాయులు ఆర్.వెంకటేశ్వరరావు స్పోకెన్ ఇంగ్లీష్‌లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. సామర్లకోట తెలుగు పండిట్ ఎం.రిషికుమార్ తెలుగు వ్యాకరణంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పుస్తక పఠనం, పాటల పాడటంలో శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయాధికారి పాలంకి నాగరాజు, గ్రంథాలయ సిబ్బంది, పాఠకులు పాల్గొన్నారు. సామర్లకోట రూరల్ మాధవపట్నం జమునానగర్ కాలనీ అంగర లక్ష్మీకాంతం ఎడ్యుకేషనల్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాల మందిరంలో అంగర గోపాలకృష్ణ అధ్యక్షతన విద్యార్థులకు చిత్రలేఖనంపై తరగతులు నిర్వహించారు. డ్రాయింగ్ ఆర్టిస్టు పి.వీరబాబు పాల్గొన్నారు.










