Jun 28,2023 20:12

ధర్నా నిర్వహిస్తున్న నాయకులు, విద్యార్థులు

ప్రజాశక్తి - ఆదోని
ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందించాలని ఎస్‌ఎఫ్‌ఐ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు భరత్‌ కుమార్‌, శ్రీనివాసులు, గర్ల్స్‌ కన్వీనర్‌ సంయుక్త డిమాండ్‌ చేశారు. బుధవారం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ప్రభుత్వ కళాశాల నుంచి విద్యార్థినులు ర్యాలీగా సబ్‌ కలెక్టర్‌ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. పేద విద్యార్థులు పాఠ్య పుస్తకాలు కొనుక్కోలేని పరిస్థితి ఉందన్నారు. వెంటనే ఇంటర్మీడియట్‌ విద్యకు ప్రత్యేక నిధులు కేటాయించి ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందజేయాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం సబ్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు గణేష్‌, నాగరాజు, గౌస్‌, పవన్‌, రాజు, శాంతి, రాధిక పాల్గొన్నారు.