Jul 24,2023 19:01

దీక్ష చేపడుతున్న నాయకులు

ప్రజాశక్తి-ఆలూరు
ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందించాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం ఆలూరు పాత బస్టాండ్‌ ఆవరణలో 8 గంటల దీక్ష చేపట్టారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా మాజీ ఉపాధ్యక్షులు మైనా, గోవర్ధన్‌లు ఎస్‌ఎఫ్‌ఐ నాయకులకు పూలమాలలు వేసి దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు సంయుక్త, మండల కార్యదర్శి లక్ష్మీనారాయణ మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు ప్రారంభమై 47 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నేటికీ ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఇవ్వకపోవడం సిగ్గు చేటన్నారు. ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు గతంలో ఉచితంగా ప్రభుత్వమే పాఠ్యపుస్తకాలు అందించేదని తెలిపారు. నేడు రాష్ట్ర ప్రభుత్వం పాఠ్య పుస్తకాలు ఇవ్వడానికి నిరాకరిస్తుందంటే పేద విద్యార్థులకు చదువును దూరం చేయడమేనని విమర్శించారు. 3 వేలకు పైగా అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయకపోవడం దుర్మార్గమన్నారు. పుస్తకాలు, అధ్యాపకులు లేకపోవడంతోనే గత విద్యా సంవత్సరం జూనియర్‌ కళాశాలల్లో 36 శాతం మాత్రమే ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. అధ్యాపకులు లేకుండా చదువెలా సాగుతుందని ప్రశ్నించారు. నేటికీ 474 ఇంటర్మీడియట్‌ కళాశాలల్లో 210 మంది ప్రిన్సిపల్స్‌ లేరని, 26 జిల్లాలకు పర్మినెంట్‌ ఆర్‌ఐఒలు, 13 మంది డిఇఒలు లేరని తెలిపారు. ఇంటర్మీడియట్‌ అడ్మినిస్ట్రేషన్‌ సిలబస్‌ ప్రణాళిక తూతూమంత్రంగా నడుస్తోందని చెప్పారు. ఉపాధ్యాయులు లేకుండా విద్యార్థులకు నాణ్యమైన విద్య ఎలా వస్తుందని ప్రశ్నించారు. ఈ సమస్యలన్నింటినీ ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. వైసిపి ప్రభుత్వం వచ్చాక మధ్యాహ్న భోజన పథకాన్ని నిలిపివేసిందని తెలిపారు. ఈ నిరసన దీక్షకు సిపిఎం నాయకులు కెపి.నారాయణ స్వామి, షాకీర్‌, కృష్ణ, ఎఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర సమితి సభ్యులు మునిస్వామి మద్దతు తెలిపారు. ఎస్‌ఎఫ్‌ఐ మండల ఉపాధ్యక్షులు గిరిమూర్తి, ఉమేష్‌, నాయకులు గాది, వంశీ, ప్రేమ్‌ కుమార్‌, గణేష్‌, తేజ, మల్లి, మధు, మల్లికార్జున, కరుణాకర్‌ పాల్గొన్నారు.