కాంట్రాక్టర్లకు ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి సూరజ్ గనోరే ఆదేశం
ప్రజాశక్తి-మారేడుమిల్లి
ఏజెన్సీలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలోని చదువుతున్న విద్యార్థులకు ఎప్పటికప్పుడు తాజా కూరగాయలు, కోడి మాంసం, అరటి పండ్లు, కోడిగుడ్లు, సరఫరా చేయాలని సంబంధిత కాంట్రాక్టర్లను రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి సూరజ్ గనోరే ఆదేశించారు. బుధవారం స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో గిరిజన సంక్షేమ శాఖ ఇన్‌ఛార్జి డిప్యూటీ డైరెక్టర్ సిహెచ్.శ్రీనివాసరావు, అసిస్టెంట్ గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, హాస్టల్ వెల్ఫేర్ అధికారులు, జిసిసి మేనేజర్లు, నిత్యవసర వస్తువులు సరఫరా చేసే కాంట్రాక్టర్లతో ప్రాజెక్ట్ అధికారి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీలోని ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలు మొత్తం 83 ఉన్నాయని, ఆ విద్యార్థులకు తాజాగా ఆహార పదార్థాలు తయారుజేసే విధంగా సకాలంలో అందజేయాలని కోరారు. కూరగాయలు, పాలు, గుడ్లు, చికెన్, అరటి పండ్లు సరఫరా చేయడానికి మూడు నెలలకు ఒక సారి టెండర్లు పిలవడం జరుగుతుందని చెప్పారు. ఆదివారం, మంగళవారం వారానికి రెండు రోజులు తాజా కోడి మాంసం టెండర్‌దారులు నేరుగా సంబంధిత హాస్టలకు అందజేయాలని ఆదేశించారు. అరటిపండు 100 గ్రాములు, కోడిగుడ్డు 50 గ్రాములు తప్పనిసరిగా సరఫరా చేయాలన్నారు. కోడిగుడ్లు నెలకు మూడుసార్లు ప్రతి హాస్టల్‌కు చేరవేసే బాధ్యత సంబంధిత టెండర్లదారులపై ఉందని స్పష్టం చేశారు. రికార్డులు పక్కాగా నిర్వహించాలని, ఎప్పటికప్పుడు బిల్లులు అప్లోడ్ చేయాలని వార్డెన్లను ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలన్నారు. పాఠశాలల్లో ఎప్పటికప్పుడు పారిశుధ్య కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. ఆశ్రమ పాఠశాలలో అధికారుల అనుమతులు లేకుండా ఇతరులను లోపలికి అనుమతించరాదన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కాంట్రాక్టర్లు, వార్డెన్లకు సూచించారు. ఈ సమావేశంలో ఎటిడబ్ల్యూఓలు, రామతులసి, హాసిని, జిసిసి డిఎం పార్వతీశం, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ బి.కిషోర్, జిసిసి సీనియర్ మేనేజర్లు ఎంఎన్ రాజారెడ్డి, జి.చంద్రశేఖర్, విజయలక్ష్మి పాల్గొన్నారు.










