Sep 08,2023 22:59

మాట్లాడుతున్న కలెక్టర్‌

ప్రజాశక్తి-గుంటూరు : విద్యాహక్కు చట్టం-2009లోని సెక్షన్‌17 మేరకు విద్యార్థులకు భౌతిక శిక్షల నివారణపై ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు, ప్రిన్సిపాల్స్‌కు ఒక రోజు అవగాహన కార్యక్రమం కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌.శంకరన్‌ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించారు. శుక్రవారం నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చైల్డ్‌ రైట్స్‌ (ఎన్‌సిపీసీఆర్‌) ఆదేశాల మేరకు స్టేట్‌ కమిషన్‌ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చైల్డ్‌ రైట్స్‌ (ఎస్‌సిపీసీఆర్‌) జిల్లా స్థాయిలో డిఇఒ పి.శైలజ అధ్యక్షతన నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఎన్‌సిపీసీఆర్‌ సౌత్రన్‌ స్టేట్స్‌ ప్రోగామ్‌ కన్వీనర్‌ చిట్టిబాబుతో కలసి కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ రాజ్యాంగంలో పొందుపరచిన బాలల హక్కుల గురించి ప్రతి ఉపాధ్యాయుడు తెలుసుకోవాలన్నారు. గతంలో ఉపాధ్యాయులు విద్యార్డులను మందలిస్తే దానికి అర్థం వుండేదని, తల్లితండ్రులు కూడా పిల్లల భవిష్యత్తు గురించే ఉపాధ్యాయులు మందలించారని అనుకునేవారని అన్నారు. కాని ఇప్పుడు ఉపాధ్యాయులకు కొన్ని సవాళ్లు వచ్చాయని, పిల్లలు తప్పు చేస్తే దండన ఒక్కటే పరిష్కారం కాదని, ఇప్పటి పిల్లల్లో మానసిక స్థైర్యం తగ్గి విపరీతమైన చర్యలకు క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఉపాధ్యాయులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ తమపై ఉన్న ఒత్తిడిని విద్యార్థులపై, సబార్డినేట్‌ ఉద్యోగులపై చూపించడం భావ్యం కాదన్నారు. పిల్లలకు సంబంధించిన విషయాల్లో వారిని ఎడ్యుకేట్‌ చేయాలని, వారికి చదువుతో పాటు సంస్కారం నేర్పించాలని సూచించారు. మానవత్వంతో కూడిన విలువలు నేర్పించాలన్నారు. ఉపాధ్యాయులు ఇవన్ని చేస్తూ కూడా బాలలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను దృష్టిలో పెట్టుకోవాలన్నారు.
ఎస్‌సీఈఆర్‌టీ స్టేట్‌ నోడల్‌ ఆఫీసర్‌ చైల్డ్‌ రైట్స్‌ సోమశేఖర్‌ బ్రహ్మానందం మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్‌లో జరిగిన సంఘటనను వివరిస్తూ మన పాఠశాలల్లో ఇలాంటివి జరగకుండా చూడాలన్నారు. విద్యార్డులకు గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌లపై అవగాహన కల్పించాలని, పిల్లలను ఎక్కడబడితే అక్కడ తాకకూడదని, తల్లితండ్రులకు చెప్పలేని విషయాలు స్నేహితులకు చెబుతారని, అదే విధంగా ఉపాధ్యాయులకు చెప్పుకోవాలనే భరోసా వారికి కల్పించాలని అన్నారు. పిల్లల చట్టాలు చాలా బలంగా ఉన్నాయని, ప్రతి స్కూల్‌లో కంప్లయింట్‌ బాక్స్‌ పెట్టాలని, ప్రాతి 15 రోజులకు ఒకసారి మహిళా పోలీసు, ఎన్‌ఎన్‌ఎంలు కలసి ఓపెన్‌ చేసి వచ్చిన ఫిర్యాదులను, ఎంఇఒ, డిఇఒలకు పంపాలన్నారు. భౌతికంగా, మానసింగా హింసించరాదని, అశ్లీల దశ్యాలు చూపరాదని అన్నారు. పిల్లల్ని చిరునవ్వుతో పలకరించాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌సిఈఆర్‌టి, పీఈపీ, హెచ్‌ఓడి డాక్టర్‌ హేమరాణి, ఆర్‌జెడి సుబ్బారావు, డిప్యూటీ డిఈఓ పి.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.