ప్రజాశక్తి-విజయవాడఅర్బన్: విద్యార్థులకు సైన్స్‌పై అవగాహన అవసరమని వరంగల్‌లోని ఎన్‌ఐటీ ఫిజిక్స్ ప్రొఫెసర్ డి.హరినాథ్ సూచించారు. సిద్ధార్థ కళాశాల ఫిజిక్స్ విభాగం ఆధ్వర్యంలో గురువారం సిద్ధార్థ ఆడిటోరియంలో సెన్టెల్లా-4.0 పేరుతో సాంకేతిక, సాంస్కతిక అంశాల్లో విద్యార్థులకు పోటీలను నిర్వహించారు. హరినాథ్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ ప్రతి వ్యక్తిలో ఏదో ఒక నైపుణ్యం ఉంటుందని, ఇలాంటి వేదికల్లోనే ఆ నైపుణ్యాలు బహిర్గతం అవుతాయన్నారు. సాంకేతికంగా వస్తున్న మార్పులను విద్యార్థులు ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకుంటూ ప్రతిభ చాటేందుకు సన్నద్ధం కావాలని సూచించారు. కళాశాల డైరెక్టర్ వేమూరి బాబూరావు మాట్లాడుతూ విద్యార్థుల్లో సజనాత్మకతను పెంపోందించడానికి ఇలాంటి కార్యక్రమాలను తమ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ మేకా రమేష్, డీన్ రాజేష్ సి జంపాల మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల విద్యార్థులు ఒకరి ఆలోచనలను మరొకరు పంచుకోవచ్చని తెలిపారు. విద్యార్ధులు డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని హితవు పలికారు. ఫిజిక్స్ విభాగాధిపతి టి.శ్రీనివాసకృష్ణ మాట్లాడుతూ కేవలం కళాశాల స్థాయి విద్యార్థులకే కాకుండా హైస్కూల్ స్థాయిలోని విద్యార్థులకు కూడా ఫిజిక్స్‌పై మక్కువ పెంచడానికి సెన్టెల్లా-4.0లో పోటీలను నిర్వహించామన్నారు. ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు కళాశాల, పాఠశాల స్థాయి వేర్వేరుగా నిర్వహించిన పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులు తయారు చేసిన ప్రయోగాల నమూనాల ప్రదర్శన (ఐస్), క్విజ్, రెప్లికా పోటీలతో పాటుగా రోల్ పే పేరుతో విద్యార్థులు ప్రముఖ సైటిస్ట్ వేషధారణలో అలరించారు. గెస్ ఇట్, జస్ట్ ఏ మినిట్, పోస్టర్ ప్రజంటేషన్ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని వారిలోని ప్రతిభను చూపారు. మధ్యాహ్నాం నుంచి నృత్యాలు, సింగింగ్, ట్రెజంట్, స్పాట్ ఫొటోగ్రఫి, జస్ట్ ఏ మినిట్ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు, జ్ఞాపికలు అందజేశారు.










