విద్యార్థులకు రాగి జావా
- జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్
- తాడేపల్లి నుండి ప్రారంభించిన సిఎం జగన్‌మోహన్ రెడ్డి
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
జిల్లాలోని 1369 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న 1,52,638 విద్యార్థులకు జగనన్న గోరుముద్దలో భాగంగా 150 ఎంఎల్ రాగి జావా అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ తెలిపారు. మంగళవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి జగనన్న గోరుముద్దలో భాగంగా మరో పౌష్టికాహారం రాగి జావా అందించే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్‌తో పాటు నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, మున్సిపల్ చైర్మన్ మాబున్నిసా, డిఇఒ అనురాధ, విద్యార్థులు తదితరులు ఈ కార్యక్రమాన్ని లైవ్ ద్వారా వీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు వారంలో మూడు రోజులపాటు 150 ఎంఎల్ రాగి జావా అందిస్తామని తెలిపారు. గతంలో కంటే ప్రస్తుతం మధ్యాహ్న భోజన పథకంలో పెనుమార్పులు తీసుకొచ్చి రోజుకో మెనూ ప్రకారం రుచికరమైన పౌష్టికాహారంతో కూడిన ఆహార పదార్థాలు అందిస్తున్నామని చెప్పారు. ఐరన్, కాల్షియం లాంటి పోషకాలు అందించి విద్యార్థుల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు బెల్లంతో కూడిన రాగిజావను అందించే మంచి కార్యక్రమాన్ని సిఎం ప్రారంభించారని తెలిపారు. అనంతరం కలెక్టర్‌తో పాటు ఎంపీ, మున్సిపల్ చైర్మన్, డిఇఒలు విద్యార్థులకు రాగి జావా పంపిణీ చేశారు.










