ప్రజాశక్తి-పంగులూరు: విద్యార్థులకు పోషకాలతో కూడిన రాగి జావను అందిస్తున్నట్లు, కొండమంజులూరు గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాలపర్తి తిరుపతయ్య తెలిపారు. గురువారం ఉదయం పాఠశాలను పరిశీలించేందుకు వెళ్లిన విలేకరుల బృందంతో ఆయన మాట్లాడారు. పాఠశాలలో 74 మంది విద్యార్థులు ఉన్నారని, ఇంకా తల్లిదండ్రులు పనుల కోసం వలస పోవడం వలన కొంతమంది విద్యార్థులు హాజరు కాలేకపోతున్నారని తెలిపారు. విద్యార్థులకు వారంలో మూడు రోజులు రోజు మార్చి రోజు రాగి జావ ఇస్తున్నామని చెప్పారు. పాఠశాలకు వచ్చే ప్రతి విద్యార్థికి 10 గంటల సమయంలో రాగిజావను ఒక్కొక్కరికి ఒక గ్లాసు చొప్పున అందిస్తున్నట్లు తెలిపారు. రాగిజావ తాగటం వలన విద్యార్థులలో రక్తహీనత తగ్గిపోతుందని, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని చెప్పారు. పిల్లలు ఆరోగ్యంగా, నీరసం లేకుండా ఉంటారని తిరుపతయ్య అన్నారు. ప్రభుత్వం రాగిపిండి, బెల్లం ఇస్తుందని ఆయన చెప్పారు. విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యతో పాటు, మంచి ఆరోగ్యవంతమైన ఆహారాన్ని కూడా మధ్యాహ్న భోజనంగా ఇస్తున్నామని చెప్పారు.










