Oct 18,2022 23:32

న్యూట్రిషన్‌ కిట్లను అందజేస్తున్న సర్పంచ్‌

ప్రజాశక్తి, ఆనందపురం : విద్యార్థుల్లో రోగ నిరోధక శక్తిని పెంపొందించడమే లక్ష్యంగా చెగ్‌, సీడ్స్‌ (సస్టైనబుల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ అండ్‌ ఎకోలాజికల్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ) ఆధ్వర్యంలో మంగళవారం బోయపాలెంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులకు పోషకాహార కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీడ్స్‌ సహ వ్యవస్థాపకుడు మను గుప్తా మాట్లాడుతూ వాతావరణ మార్పు, కోవిడ్‌, ఆహార అభద్రత వంటి సంక్షోభాలతో సరైన పౌష్టికాహారానికి నోచుకోని ఢిల్లీలోని 28, విశాఖపట్నంలోని 66 పాఠశాలలను ఎంపిక చేసి, అందులోని 15,500 మంది విద్యార్థులకు న్యూట్రిషన్‌ కిట్‌లను అందజేస్తామన్నారు. చెగ్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ టిఎస్‌.విజరు టీఎస్‌ మాట్లాడుతూ విద్యార్థులకు ఆరోగ్యకరమైన ఆహారం అందించడానికి సీడ్స్‌తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ వానపల్లి లక్ష్మి ముత్యాలరావు, ప్రధానోపాధ్యాయులు వై వెంకటేశ్వరరావు, చెగ్‌ సీనియర్‌ మేనేజర్‌ మహమ్మద్‌ ఇమ్రాన్‌ పాల్గొన్నారు.