ప్రజాశక్తి - భీమడోలు
ఉపాధ్యాయునిగా తాను విద్యాబోధన చేసిన సోషల్ సబ్జెక్ట్‌పై ఆసక్తితో, దాని ప్రచారానికి తన వంతు సహాయం అందజేస్తున్న విశ్రాంత ఉపాధ్యాయులు తుమ్మల వెంకట ఉమామహేశ్వరరావు సేవలు అభినందనీయమని భీమడోలు హైస్కూల్ హెచ్‌ఎం శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక హైస్కూల్లో బుధవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో గత విద్యా సంవత్సరం నిర్వహించిన పదవ తరగతి పరీక్షల్లో సోషల్ సబ్జెక్టుల్లో అత్యధిక మార్కులు సాధించిన తెలుగు, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఒక్కొక్కరికి రూ.2వేల నగదు ప్రోత్సాహకాలను తుమ్మల వెంకట ఉమామహేశ్వరరావు హెచ్‌ఎం చేతుల మీదగా అందజేశారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ 2016-17 సంవత్సరంలో తాను ఉంగుటూరు మండలం గొల్లగూడెం హైస్కూల్‌కు బదిలీ అయ్యానన్నారు. ఆ సంవత్సరం పాఠశాల స్థాయిలో ఒక విద్యార్థి మాత్రమే 10/10 జిపిఎ సాధించారన్నారు. దీంతో పాఠశాల స్థాయిలో 10/10 జిపిఎ సాధించిన విద్యార్థులలో సోషల్ సబ్జెక్టులో అత్యధిక మార్కులు సాధించిన వారికి నగదు పురస్కారం ప్రకటించి, ఆవిధంగా సాధించిన ఐదుగురు విద్యార్థులకు రూ.5వేల నగదు పురస్కారం అందజేశామన్నారు. అదే స్ఫూర్తితో పాఠశాలకు చెందిన విద్యార్థులు 20 మంది ఆతర్వాత సంవత్సరం నిర్వహించిన పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో 10/10 జిపిఎ సాధించారన్నారు. వారికి రూ.20వేల నగదు పురస్కారాన్ని అందజేశామని తెలిపారు. 10/10 జిపిఎస్ సాధనలో ఒకే పాఠశాలకు చెందిన 20 మంది సాధించటం అది అప్పట్లో తాడేపల్లిగూడెం డివిజన్ పరిధిలో రికార్డుగా నమోదైందన్నారు. ఆ తర్వాత ఉద్యోగ విరమణ చేసిన తనను విద్యార్థులు ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారని తెలిపారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం విద్యార్థులకు రూ.2వేలు నగదు పురస్కారం అందజేస్తున్నానని, దానిని కొనసాగించేందుకు తాను కృషి చేస్తున్నట్లు తెలిపారు. సోషల్ సబ్జెక్ట్ ప్రాముఖ్యత గురించి ప్రచారం చేస్తూ, ఆ మేరకు కృషి చేస్తున్న ఉమామహేశ్వరావును ఈ సందర్భంగా పాఠశాల హెచ్‌ఎంతో పాటు భీమడోలు డైమండ్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు బొబ్బా రమేష్, విశ్రాంత ఉపాధ్యాయులు పి.బ్రహ్మరావు, ఇతర ప్రముఖులు అభినందించారు.










