Dec 02,2022 00:11

రీ సర్వే పనులను పరిశీలిస్తున్న పిఒ సూరజ్‌ గనోరే, సబ్‌ కలెక్టర్‌ శుభం బన్సల్‌

ఐటిడిఎ ప్రాజెక్ట్‌ అధికారి సూరజ్‌ గనోరే
ప్రజాశక్తి - రంపచోడవరం

ఏజెన్సీలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహార పదార్థాలు పెట్టాలని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారి సూరజ్‌ గనోరే సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం రంపచోడవరం మండలం బూసిగూడెం బాలికల ఆశ్రమ పాఠశాలను, రంప శివాలయ సమీపంలోని టూరిజం ప్రాంతాన్ని వాటర్‌ ఫాల్స్‌ను ప్రాజెక్ట్‌ అధికారి పరిశీలించారు. ముందుగా భూసిగూడెంలో బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించి ప్రతిరోజు ఏయే ఆహార పదార్థాలు పెడుతున్నారో, విద్యాబోధన ఏ విధంగా సాగుతుందో ఆరా తీశారు. ఆశ్రమ పాఠశాల నాడు నేడు పనులు గురించి అడిగి తెలుసుకున్నారు. హాస్టల్‌కు సంబంధించిన నిత్యవసర వస్తువుల బిల్లులు ఎప్పటికప్పుడు అప్లోడ్‌ చేసి సమర్పించాలని ఆదేశించారు. అనంతరం రంప శివాలయం సమీపంలోని పర్యటక కేంద్రానికి వచ్చే టూరిస్ట్‌లకు ఏయే సౌకర్యాలు ఏర్పాటు చేసింది తదితర అంశాలపై ప్రాజెక్ట్‌ అధికారి ఆరా తీసి పరిశీలించారు.
భూ రీ సర్వే పరిశీలన
ఏజెన్సీలోని ప్రభుత్వ భూములకు ప్రైవేట్‌ భూములకు రిస్వర్వైజ్‌ చేసి హక్కు పత్రాలు మంజూరు చేయడం జరుగుతుందని ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారి సూరజ్‌ గనోరే, రంపచోడవరం సబ్‌ కలెక్టర్‌ శుభం బన్సల్‌ పేర్కొన్నారు. గురువారం మండలంలోని జాగరంపల్లి గ్రామంలో భూహక్కు భూరక్ష ప్రోగ్రాం కింద భూముల రీ సర్వే పనులను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రీ సర్వే చేయు సమయంలో ఆయా గ్రామ పంచాయతీల సర్పంచులను పెద్దలను తదితరులతో సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దారు పొదిలి వెంకటేశ్వరరావు, వీఆర్వో జి.గుణ భూషణం పాల్గొన్నారు.