Oct 16,2023 22:39

ప్రజాశక్తి- యాదమరి: విద్యార్థులకు గైడ్ల ద్వారా విద్యాబోధనను ప్రోత్సహించకండి అని జిల్లా ఉప విద్యాశాఖ అధికారి చంద్రశేఖర్‌ ఉపాధ్యాయులను ఆదేశించారు. సోమవారం యాదమరి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెండు రోజుల క్రితం మండల కేంద్రానికి విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ ప్రవీణ్‌ ప్రకాష్‌ మండలంలో కొంతమంది విద్యార్థి ఇళ్లలో విద్యార్థులు ఎలా చదువుతున్నారని ఇళ్ల వద్దకు వెళ్లి ఆరా తీశారు. ఈ సందర్భంలో మండల కేంద్రంలోని ఓవిద్యార్థి గైడ్ల ద్వారా నోట్స్‌ విద్యను అభ్యసిస్తున్నట్టు గుర్తించారు. ఆయన వెంటనే గైడ్‌ ద్వారా విద్యా బోధన ఎవరు ప్రోత్సహిస్తున్నారని అలాంటి ఉపాధ్యాయులను గుర్తించి తమకు నివేదిక అందించాలని డిప్యూటీ డీఈవోను ఆదేశించారు. ప్రిన్సిపల్‌ సెక్రెటరీ ఆదేశాల మేరకు సోమవారం మండల కేంద్రంలోని విద్యార్థి ఇంటిని పరిశీలించారు. అనంతరం ఉన్నత పాఠశాలలోని ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. గైడ్ల ద్వారా ఏ ఉపాధ్యాయులు ప్రోత్సహిస్తున్నారని ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు ప్రతిఒక్కరూ విద్యాబోధన సమయంలో గైడ్ల ద్వారా విద్యా బోధనను చేపట్టరాదని తెలిపారు. పాఠశాలకు సక్రమంగా రాని విద్యార్థులను గుర్తించి వారి తల్లిదండ్రులకు తెలియజేసి సక్రమంగా వచ్చే విధంగా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థులకు నోట్స్‌ను నెలవారి పాఠ్యాంశాలను ఆ నెలలోపు విద్యార్థులకు క్షుణ్ణంగా వారికి అర్థమయ్యే రీతిలో బోధించాలని సూచించారు. గైడ్స్‌ ద్వారా చదువు చెప్పే విధానానికి స్వస్తి పలకాలని సూచించారు. ప్రతి ఉపాధ్యాయుడు ప్రతి విద్యార్థిలోని నైపుణ్యాన్ని వెలికి తీసి ఆత్మధైర్యాన్ని నింపాలన్నారు. ఉపాధ్యాయులు ప్రతిఒక్కరూ స్నేహపూర్వక వాతావరణంలో విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పాఠ్యాంశాలను బోధించి వారిని మంచి మార్కులు ఉత్తీర్ణ శాతాన్ని పెంచే విధంగా తీర్చిదిద్దాలన్నారు. రాబోయే పరీక్షల్లో 100శాతం ఉత్తీర్ణశాతాన్ని సాధించాలని ఆ రకంగా ఇప్పటినుండి విద్యార్థులకు తర్ఫీదు ఇచ్చేందుకు ప్రతి ఉపాధ్యాయుడు సంసిద్ధం కావాలని కోరారు. జిల్లా ఉపవిద్యాశాఖ అధికారి చంద్రశేఖర్‌. చిత్తూరు ఎంఈఓ మోహన్‌, గుడిపాల ఎంఈఓ గణపతి, ఎంఈఓ ప్రసాద్‌, ప్రధానోపాధ్యాయులు గిరి రాజారావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.