Nov 20,2023 16:40

ప్రజాశక్తి - చింతలపూడి
   చట్టాలపై అవగాహన అవసరమని, చదువుతో పాటు సంస్కారం, దేశభక్తి పెంపొందించుకోవాలని చింతలపూడి జూనియర్‌ సివిల్‌ జడ్జి సి.మధుబాబు అన్నారు. పట్టణంలో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ బాలల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హక్కులు, బాధ్యతలు, ట్రాఫిక్‌ రూల్స్‌, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్య వివాహాల నిరోధక చట్టం, పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. పిల్లలు పౌష్టికాహారం తీసుకోవాలని, 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకు విద్యా హక్కు చట్టం ద్వారా అందరూ చదువుకోవాలన్నారు. 14 సంవత్సరాల లోపు పిల్లలను కార్మికులుగా హోటళ్లలో, కర్మాగారాల్లో, షాపులలో పని చేయించకూడదని, ఎవరైనా బాలలను పనిలో పెట్టుకుంటే నేరమని అలాంటి వారికి జైలు, జరిమానా విధిస్తారని తెలిపారు. బాల కార్మికులను గుర్తించి వారిని బడి బాటలోకి తీసుకు వెళ్లాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఆడపిల్లలకు 18 సంవత్సరాలు నిండకుండా పెళ్లి చేస్తే దానిని బాల్య వివాహాలు కింద పరిగణించి చట్టప్రకారం చర్యలు తీసుకుంటారని తెలియజేశారు. అనంతరం ఇన్‌ఛార్జి సిడిపిఒ లీలా కుమారి మాట్లాడుతూ 'గుడ్‌ టచ్‌చ, బాడ్‌ టచ్‌పై' అవగాహన కల్పించారు. ఆడ, మగ పిల్లలు సహోదర భావాన్ని కలిగి ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు డేవిడ్‌ రాజు, కుమారి మౌనిక, సోషల్‌ వర్కర్‌ ఎమ్‌డీ అక్బర్‌ అలీ, పట్టణ సిఐ మల్లేశ్వరరావు, ప్రధానోపాధ్యాయులు మురళీకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.