ప్రజాశక్తి-ఆలూరు
ఆలూరు, మొలగవల్లి గ్రామంలో 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్బంగా ఆలూరు గ్రంథాలయ అధికారి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. శుక్రవారం జూనియర్ కళాశాల ఆడిటోరియంలో మోడల్ స్కూల్, బార్సు-1, 2, గురుకుల పాఠశాల 6, 7, 8వ తరగతి విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. మొలగవల్లి గ్రంథాలయ అధికారి విజయ భాస్కర్ ఆధ్వర్యంలో సమ్మేళనాలు, రచయితల సందేశాలు, వారోత్సవాల సందర్భంగా కవి సమ్మేళనం నిర్వహించారు. ప్రముఖ కవి, ఉపాధ్యాయులు అన్నే శ్రీనివాస రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా కవులతో ఇష్టాగోష్టి నిర్వహించారు. ఇష్టాగోష్టిలో కవి అన్నే శ్రీనివాస రెడ్డి, కళాకారులు మోక మల్లయ్య, హార్మోనిస్టు గోపాల్, దండు మాణిక్య రెడ్డి పాల్గొన్నారు. శ్రీనివాస రెడ్డి తమ పద్య కవితలతో పాఠకులను అలరించారు. భవాని పాత్ర ధారి దండు మాణిక్య రెడ్డి తన అభినయాన్ని ప్రదర్శించారు. అనంతరం కవులను, కళాకారులను సన్మానించారు. ఉపాధ్యాయులు ప్రకాష్, శివ, ఆదిలక్ష్మి, ఛత్రప్ప, గ్రామస్తులు పాల్గొన్నారు.