Jun 23,2023 19:17

ఆర్‌టిసి డిఎంకు వినతిపత్రం ఇస్తున్న నాయకులు

ప్రజాశక్తి - ఆదోని
గ్రామీణ నిరుపేద విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలని ఎస్‌ఎఫ్‌ఐ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు భరత్‌ కుమార్‌, శ్రీనివాసులు కోరారు. శుక్రవారం ఆర్‌టిసి డిపో మేనేజర్‌ రఫీ అహ్మద్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆదోని డివిజన్‌ కేంద్రంలోని కళాశాలకు, పాఠశాలకు వివిధ గ్రామాల నుంచి వందల మంది విద్యార్థులు విద్యనభ్యసించేందుకు వస్తున్నారని తెలిపారు. గ్రామీణ విద్యార్థులకు సరైన సమయానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో తరగతులకు హాజరు కాలేకపోతున్నారన్నారు. తప్పనిసరి పరిస్థితిలో ఆటోల్లో ప్రయాణించి ప్రమాదాలకు గురైన సంఘటనలూ ఉన్నాయన్నారు. విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక విద్యార్థి బస్సులు నడపాలని కోరారు. నాయకులు గణేష్‌, నాగరాజు, జి.గౌస్‌, వెంకటేష్‌, పవన్‌, ఈరన్న పాల్గొన్నారు.