Dec 22,2022 00:07

విద్యార్థులకు ట్యాబ్‌లు అందిస్తున్న విశాఖ కలెక్టర్‌ మల్లికార్జున ఎమ్మెల్యే ముత్తంశెట్టి తదితరులు

ప్రజాశక్తి- ఆనందపురం : విద్యార్థులకు బైజూస్‌ కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని విశాఖ జిల్లా స్థాయిలో ఆనందపురం మండలం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో బుధవారం విశాఖ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మల్లికార్జున మాట్లాడుతూ, విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీ పడే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. చెప్పారు. నాడు నేడు పనుల ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పోరేట్‌ స్కూల్స్‌కు దీటుగా సుందరీకరణ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యా, అభ్యాస అంతరాన్ని తగ్గించడం కోసం, అభ్యసన ఫలితాలను డిజిటల్‌ పరికరాల కంటెంట్‌ను ఉపయోగించి విద్యను అభ్యసించడం కోసం ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్ధులకు బైజూస్‌ యొక్క ప్రీమియం కంటెంటును లోడ్‌ చేసిన ట్యాబ్‌ లను ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు. విశాఖ జిల్లాలో 11,223 విద్యార్ధులకు, 1,116 మంది ఉపాధ్యాయులకు కలిపి మొత్తం 12,339 ట్యాబ్‌ లను పంపిణీ చేస్తున్నామన్నారు.
భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ చదువుతోనే సుజ్ఞానంతో కూడిన భవిష్యత్తు ఉందని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. భీమిలి నియోజక వర్గంలో 2049 మంది బాలికలకు, 2113 బాలురకు, 280 మంది ఉపాధ్యాయులకు కలిపి 4442 ట్యాబ్‌లు అందించినట్లు చెప్పారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ మల్లికార్జునను సన్మానించారు. విద్యార్థులు సంప్రదాయ నృత్యాలు ప్రదర్శించారు. అనంతరం ఎంపిపి శారద ప్రియాంక ఆధ్వర్యాన మండలంలో నిర్వహించిన వాలీబాల్‌ విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రఘువర్మ, బాలల హక్కుల కమిషన్‌ సభ్యులు సీతారామ్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎగ్జామినేషన్‌ దేవానంద్‌ రెడ్డి, డిఇఒ చంద్రకళ, ఎండిఒ లవరాజు, తహశీల్దార్‌ రామారావు, ఆనందపురం పాఠశాల కమిటీ చైర్మన్‌ చందక అప్పలస్వామి, ఎఇఒ పద్మావతి, జెడ్‌పిటిసి కోరాడ వెంకటరావు, వైస్‌ ఎంపిపి పాండ్రంకి శ్రీను, వైసిపి మండల వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మజ్జి వెంకటరావు పాల్గొన్నారు.