Jul 15,2023 20:41

పెద్దహోతూరు జడ్‌పిహై స్కూల్‌లో విద్యార్థులతో మాట్లాడుతున్న ప్రవీణ్‌ ప్రకాష్‌

ప్రజాశక్తి-ఆలూరు
పదో తరగతిలో ఫెయిలైన విద్యార్థులకు మళ్లీ పాఠశాలలో చేరి రెగ్యులర్‌గా పాసయ్యే అవకాశం ఉందని, వాటిపై అవగాహన కల్పించడంలో విఫలం చెందారని విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాష్‌ డిఇఒ రంగారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మండలంలోని పెద్దహోతూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, హాలహర్వి కెజిబివి పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెద్దహోతూరు పాఠశాలలో విద్యార్థులకు ఇచ్చిన హోమ్‌ వర్క్‌పై ప్రశ్నలకు జవాబు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు చెప్పిన జవాబులకు మెచ్చుకొని ఉపాధ్యాయులను ప్రశంసించారు. బూట్లు ధరించకుండా పాఠశాలకు చెప్పులతో వచ్చిన విద్యార్థులను ఇంటికి వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడారు. ప్రయివేట్‌ విద్యాసంస్థలకు ధీటుగా ప్రభుత్వం పుస్తకాలు, బ్యాగ్‌, యూనిఫారం, బూట్లు, సాక్సులు, బెల్టు ఇస్తోందని, వాటిని ధరించకుండా పాఠశాలకు పంపిస్తే విద్యార్థులకు క్రమశిక్షణ ఉండదని తల్లిదండ్రులకు తెలిపారు. నూతనంగా రూ.3 కోట్లతో నిర్మిస్తున్న జడ్‌పి ఉన్నత పాఠశాలను పరిశీలించారు. అనంతరం హాలహర్వి కెజిబివి పాఠశాలను తనిఖీ చేశారు. సర్వశిక్ష అభియాన్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ వేణుగోపాల్‌, ఎంఇఒలు కోమలదేవి, ఈరన్న, జడ్‌పిటిసి లింగన్న పాల్గొన్నారు.