Aug 10,2023 23:03

ప్రజాశక్తి - భీమడోలు  
                 ఆరోగ్య పరిరక్షణలో భాగంగా విద్యార్థులు జాతీయ నులి పురుగు నిర్మూలన కార్యక్రమ సేవలను వినియోగించుకోవాలని ఎంపిడిఒ సిహెచ్‌.పద్మావతిదేవి కోరారు. భీమడోలు మండల స్థాయిలో నులి పురుగు నిర్మూలనకు సహకరించే ఆల్బెండొజోల్‌ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని భీమడోలు హైస్కూల్లో గురువారం ప్రారంభించారు. కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్‌.శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా, ముఖ్యఅతిథిగా ఎంపిడిఒ పాల్గొన్నారు. అతిథులుగా స్వచ్ఛంద సేవా సంస్థ చైతన్య యువజన సంఘం అధ్యక్షులు డాక్టర్‌ పి.మాన్సింగ్‌, వైసిపి ప్రముఖులు టి.రంగా పాల్గొన్నారు. విద్యార్థులకు మాత్రలు వేసే కార్యక్రమాన్ని గుండుగొలను ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు ఎస్‌.శ్రీలక్ష్మి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు మాట్లాడుతూ రక్తహీనత నివారణకు ఒకటి నుంచి 19 సంవత్సరాల మధ్య వారికి ఆల్బెండొజోల్‌ మాత్రలు అందించనున్నట్లు తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గుండు గొలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని 44 అంగన్‌వాడీ కేంద్రాలు, 40 పాఠశాలలు, ఐదు కాలేజీల్లో 11,016 మంది పిల్లలకు ఆల్బెండజోల్‌ మాత్రలు వేయటం లక్ష్యంగా నిర్ణయించుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కేంద్రం సిబ్బంది నవీన్‌, రామకృష్ణ, చంద్రకళ మురళి పాల్గొన్నారు. పూళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో నులిపురుగు నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఆల్బెండజోల్‌ బిల్లల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం చేపట్టినట్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు లీలా ప్రసాద్‌, కళ్యాణమహేశ్వరి తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని 29 పాఠశాలలు, 33 అంగన్‌వాడీ కేంద్రాల్లో 4,269 మంది పిల్లలకు మాత్రలు వేయటం లక్ష్యంగా నిర్ణయించుకున్నామని తెలిపారు.
చాట్రాయి : మండలంలోని చాట్రాయి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో గ్రామ సర్పంచి దామెర ఉష చేతుల మీదుగా వైద్యాధికారి విజయలక్ష్మి విద్యార్థులకు నులిపురుగు నిర్మూలన మాత్రలు పంపిణీ చేశారు. బూరుగుగూడెం పాఠశాలలో రాష్ట్ర కోపరేటివ్‌ యూనియన్‌ ఛైర్మన్‌ దేశిరెడ్డి రాఘవరెడ్డి విద్యార్థులకు నులి పురుగు నిర్మూలన మాత్రలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఎఎన్‌ఎం, ఆశా కార్యకర్తలు మండల విద్యాశాఖాధికారి బ్రహ్మచారి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మండవల్లి : విద్యార్థి దశ నుంచే చేతులు శుభ్రం చేసుకోవడం అలవాటు చేసుకోవడం ద్వారా అనేక వ్యాధులు దరిచేరవని సర్పంచి మెండ జాన్సీ తెలిపారు. స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొని విద్యార్థులకు ఆల్బెండజోల్‌ మాత్రలను గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నులిపురుగులు సంక్రమిస్తే ఆకలి మందగిస్తుందని, రక్తహీనత ఏర్పడుతుందని, కడుపులో నొప్పి, వాంతులు, తల తిరగడం, మానసిక ఎదుగుదల లోపం తదితర లక్షణాలు కనిపిస్తాయస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పివిఎస్‌ఎస్‌జి.ప్రసాద్‌, మెండ సురేష్‌, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
ముదినేపల్లి :నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా మండలంలోని అన్ని పాఠశాలల విద్యార్థులు నులి పురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేశారు. మండలంలోని గురజ, దేవపూడి ముదినేపల్లి పిహెచ్‌సిల పరిధిలోని పాఠశాలల విద్యార్థులకు మాత్రలు పంపిణీ చేశారు.
చింతలపూడి :శరీరంలో ఉండే నులిపురుగుల నివారణ ద్వారా రక్తహీనత సమస్యను పరిష్కరించవచ్చని ఆరోగ్య విస్తరణ అధికారి ఎస్‌కె.అబ్రార్‌ హుస్సేన్‌ చెప్పారు. మండలంలోని ప్రగడవరం జెడ్‌పి హైస్కూలులో విద్యార్థులకు ఆల్బెండజోల్‌ మాత్రలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అబ్రార్‌హుస్సేన్‌ మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆల్బెండజోల్‌ మాత్రలు తీసుకోవాలన్నారు. ఎంఎల్‌హెచ్‌పి భరత్‌కుమార్‌ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఫిజికల్‌ డైరెక్టర్‌ పెట్టా వేణు, తూము రమేష్‌, రాణి పాల్గొన్నారు.
జీలుగుమిల్లి : జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఆల్బెండజోల్‌ మాత్రలు పంపిణీ చేసినట్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిని డాక్టర్‌ డి.గాయత్రి తెలిపారు. ఈ సందర్భంగా మండలంలోని పలు పాఠశాలల్లోని విద్యార్థులకు ఈ మాత్రలు వేసినట్లు ఆమె తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్‌ఒ శ్రీనివాస్‌ రాజు, హెచ్‌ఎం రాజు, హెల్త్‌ అసిస్టెంట్‌ ప్రసాద్‌, ఎఎన్‌ఎంలు, ఆశాలు పాల్గొన్నారు.