ప్రజాశక్తి - కాకినాడ రూరల్
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసమే గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసినట్టు రూరల్ ఎం ఎల్ ఎ కురసాల కన్నబాబు అన్నారు. స్థానిక పి వెంకటాపురం మైనార్టీ గురుకుల పాఠశాలలో 10వ తరగతి ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. 185 గురుకుల పాఠశాలల్లో పి వెంకటాపురం గురుకుల పాఠశాల ప్రధమస్థానం సాధించిందని చెప్పారు. కార్పొరేట్ పాఠశాలల్లో చదివితేనే మంచి విద్య లభిస్తుందని బయట జరుగుతున్న ప్రచారానికి గురుకుల పాఠశాలల ఫలితాలతో పటపంచలయ్యి పోయిందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో గురుకుల పాఠశాలల్లో ఉన్న ఫ్యాకలిటిని ఉపయోగించుకొని ప్రతీ విద్యార్థి రాణించగలరని గురుకుల పాఠశాల నిరూపించిందని అన్నారు. పేదవిద్యార్థులకు అత్యుత్తమ విద్యను అందించాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్ అమ్మఒడి కార్యక్రమాన్ని చేపట్టి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు నాంది పలికారని అన్నారు. ఇంతటి మంచిపలితాలను సాధించిన ఉపాధ్యాయులు ప్రిన్సిపాల్ అభినందనీయులన్నారు. అనంతరం అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు పుష్పగుచ్చం అందించి అభినందించారు.










