Nov 20,2022 00:00

అధికారులతో మాట్లాడుతున్న పిఒ

ప్రజాశక్తి-పాడేరుటౌన్‌: గిరిజన విద్యార్థుల సంరక్షణపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి రోణంకి గోపాలకృష్ణ అదేశించారు. శనివారం అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు లోచలిపుట్టు జిటిడబ్ల్యూ ఆశ్రమ బాలుర పాఠశాల (నెంబర్‌-1 స్కూల్‌)ను సందర్శించారు. పాఠశాల విద్యార్థి పాంగి నవీన్‌ మృతిపై ఆరా తీశారు. ఘటనపై తీసుకున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఆశ్రమ పాఠశాలలో పరిసరాలను పరిశీలించారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు ధైర్యంగా ఉండాలని మనోధైర్యాన్ని నింపారు. ఉపాధ్యాయుల, విద్యార్థుల హాజరు పట్టి, పాఠశాల రికార్డులు పరిశీలించారు. ఉపాధ్యాయులు అత్యవసరమైతే గాని సెలవులు పెట్టకూడదని ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన మెనూ అందించాలని పేర్కొన్నారు. విద్యార్థులకు వాలీబాల్‌ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూ డిడి ఐ.కొండలరావు, ఎటిడబ్ల్యూఒ ఎల్‌.రజిని, పాఠశాల హెచ్‌ఎం జివివి ప్రసాద్‌ పాల్గొన్నారు.