Nov 28,2022 23:50

డీడీకి వినతిపత్రం అందజేస్తున్న అప్పలనర్స, ఉమామహేశ్వరరావు, తదితరులు

ప్రజాశక్తి-పాడేరు టౌన్‌: టిడబ్ల్యూ ఆశ్రమ పాఠశాలల్లో సమస్యలను పరిశీలించే ప్రజా, విద్యార్థి సంఘాలతో పాటు మీడియాకు అనుమతి లేకపోతే అక్కడి సమస్యలు, అన్యాయాలు బాహ్య ప్రపంచానికి ఎలా తెలుస్తాయని గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు పి.అప్పలనర్స ప్రశ్నించారు. ఆశ్రమ పాఠశాలల్లో ఇతరుల ప్రవేశం నిషేధమని టిడబ్ల్యూ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ జారీ చేసిన సర్క్యులర్‌ రద్దు చేయాలని కోరారు. ఈ మేరకు సోమవారం ఐటిడిఎలో టిడబ్ల్యూ డిడి ఐ.కొండలరావుకు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కె.ప్రభుదాసు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వి.ఉమామహేశ్వరరావుతో కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు పి.అప్పలనర్స మాట్లాడుతూ, ఈ సర్క్యులర్‌తో ఆశ్రమాల్లో వైఫల్యాలు, లోపాలు, డొల్లతనం బయటపడే అవకాశం లేకుండా చేయడమేనని పేర్కొన్నారు. దీంతో నిర్వాహకులు ఆశ్రమాల నిర్వహణను సక్రమంగా చేయలేదని తెలిపారు. సర్క్యులర్‌ ను ఆసరాగా చేసుకుని సిబ్బంది విధులను భయం లేకుండా నిర్లక్ష్యంగా నిర్వహించే అవకాశం ఉందన్నారు. ఆశ్రమాల్లో సమస్యలపై ప్రశ్నించలేని, బయటకు చెప్పుకోలేని పరిస్థితిలో గిరిజన చిన్నారులు ఉన్నారని, సమస్యలను ఎవరు బయటకు తీసుకు వస్తారని అప్పలనర్స ప్రశ్నించారు. సుమారు 8 మండలాల్లోని ఆశ్రమ పాఠశాలల్లో సుమారు 3వేల మంది విద్యార్థులను గిరిజన సంఘం పరీక్షించగా సగానికి పైగా విద్యార్థులు చర్మ వ్యాధుల బారిన పడి ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన సంఘం ఆధ్వర్యంలో విశాఖ వైద్య బృందాల సహకారంతో ఆశ్రమాల్లో మెడికల్‌ క్యాంపులు నిర్వహించేందుకు వెళ్ళగా ఐటిడిఎ పిఒ, డిడి అనుమతి తప్పనిసరని హెచ్‌ఎంలు చెప్పడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2016లో సుమారు 30 వేల మంది గిరిజన విద్యార్థులకు చర్మవ్యాధి నివారణకు రూ.10 లక్షలతో మందులు కొనుగోలు చేసి పాఠశాలల యాజమాన్యం సహకారంతో పంపిణీ చేశామని తెలిపారు. దాతల సహకారంతో ఆశ్రమాల్లోని గిరిజన విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న మెడికల్‌ క్యాంపులను నిరాకరించడం ఏమిటని ప్రశ్నించారు. టిడబ్ల్యూ ప్రిన్సిపల్‌ సెక్రటరీ విడుదల చేసిన సర్క్యులర్‌ కారణంగా దాతలు నిర్వహించే వివిధ సేవలు విద్యార్థులకు అందకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన చిన్నారులకు వైద్య సేవలతో పాటు వివిధ సేవలందించే ప్రక్రియను కొనసాగించేందుకు గిరిజన సంఘం, వైద్య బృందం పాఠశాలల్లో అనుమతించేందుకు పాఠశాలల హెచ్‌ఎంలకు తగిన ఆదేశాలను జారీ చేయాలని కోరారు.