Jan 27,2023 23:44

మాట్లాడుతున్న జెడ్‌పిటిసి గంగరాజు

ప్రజాశక్తి-పాడేరు:గిరిజన విద్యార్థుల సమస్యల పరిష్కారంపై అధికారులకు నిర్లక్ష్యం తగదని అనంతగిరి జడ్పిటిసి సభ్యుడు దిసరి గంగరాజు తెలిపారు. శుక్రవారం ఆయన పాడేరు ఐటిడిఎ వద్ద చేపడుతున్న రిలే దీక్షల శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా గంగరాజు మాట్లాడుతూ, ప్రజా సంఘాలు 40 రోజులుగా నిర్వహిస్తున్న దీక్షలపై అధికారులు తక్షణమే స్పందించాలని, ఈ ఆందోళన కార్యక్రమాన్ని జటిలం చేయకుండా ప్రభుత్వం తక్షణమే స్పందించి న్యాయబద్ధమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.
ప్రజా సంఘాల వేదిక కన్వీనర్‌ కే.రాధాకృష్ణ, కో కన్వీనర్‌ ప్రభుదాస్‌ మాట్లాడుతూ, ప్రజా సంఘాల వేదిక ఆధ్వర్యంలో తాము శాంతియుతంగా చేస్తున్న రిలే దీక్షలను భగం చేసేందుకు పోలీస్‌లు నోటీసులను జారీ చేయించడం తగదని, దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని వెల్లడించారు. దీక్షా శిబిరం వద్ద వారు విలేకరులతో మాట్లాడుతూ, అధికారుల రాకపోకలకు ఆటంకంగా ఉందంటూ దీక్షల్ని ఈ నెల 29 లోపు నిలిపి వేయాలని పోలీసులతో నోటీసులు జారీ చేయించడం సరికాదని, గిరిజన విద్యార్థుల సమస్యలపై తాము పేర్కొన్న డిమాండ్లను పరిష్కరించేందుకు అధికారులు తక్షణమే చొరవ చూపాలన్నారు.40 రోజులుగా దీక్షలు చేస్తున్నా చోద్యం చూడటం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు చిన్నారావు, నరేష్‌, లతా కుమారి, స్వరూప, నారాయణ, అరుణ, కృష్ణవేణి, పుష్ప, చంద్రకళ, కళావతి, రాము, భవాని పాల్గొన్నారు.