Jul 25,2023 21:54

రాస్తారోకో చేస్తున్న విద్యార్థులు

ప్రజాశక్తి - కురుపాం : సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యాన విద్యార్థులు స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల నుండి రావాడ జంక్షన్‌ వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు కె.రాజు మాట్లాడుతూ జూనియర్‌ కళాశాలలో అధ్యాపకుల్లేకపోవడంతో తగిన ఫలితాలు రావడం లేదని, పాఠ్యపుస్తకాల్లేక నాణ్యమైన విద్య అందడం లేదని తెలిపారు. మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయకపోవడం దారుణమన్నారు. ఎస్టీ హాస్టళ్లలో మెనూ అమలు చేయకుండా విద్యార్థుల నోరు కొడుతున్నారన్నారు. విద్యార్థులకు వస్తున్న మెస్‌ ఛార్జీల నుండి వర్కర్లకు జీతాలు ఇస్తున్నారని, దీనివల్ల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఎస్టీ హాస్టల్లో అమలయ్యేలా, పర్మినెంట్‌ వర్కర్లను తీసుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఎస్‌ఐ మండల అధ్యక్షులు ఆరిక గంగారావు, గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎం. శ్రీనివాసరావు, జూనియర్‌ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.