Feb 26,2022 07:06

విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలను గణనీయంగా మెరుగుపరచాల్సిన అవసరం ఎంతైనా వుంది. కానీ, మోడీ ప్రభుత్వం విద్యా రంగంపై చేసే వ్యయాన్ని 6 శాతం తగ్గించింది. రాష్ట్రాల లోని ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్‌ పాఠశాలల్లో బోధనా సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది.అయినప్పటికీ ఉపాధ్యాయ నియామక ప్రక్రియను అలక్ష్యం చేస్తున్నారు. 30 మంది విద్యార్థుల కన్నా తక్కువ ఉన్న పాఠశాలలను మూసివేయాలని జాతీయ విద్యా విధానం సూచిస్తుంది. అయితే భారతదేశంలో 38 శాతం గ్రామాలలో 500 కంటే తక్కువ జనాభా వుంది. ఇలాంటి ప్రాంతాల్లో స్కూళ్లు మూసివేస్తారు. లేదా ఇలాంటి రెండు, మూడు స్కూళ్ళను విలీనం చేస్తారు. ఇది డ్రాపౌట్ల (ముఖ్యంగా బాలికలు) సంఖ్యను పెంచడం తప్ప మరొకటి కాదు.

    కోవిడ్‌-19 మహమ్మారి ప్రాణ నష్టం, నిరుద్యోగంతో పాటు విద్యా రంగం మీద కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నది. రెండు సంవత్సరాల పాటు విద్యాసంస్థలు మూతపడడంతో లక్షలాది మంది విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులు అనేక మంది ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రోజురోజుకు విద్యార్థుల మానసిక ఆరోగ్యం అధ్వాన్నంగా తయారవుతున్నది. విద్యార్థుల విశ్లేషణాత్మక సామర్థ్యం తీవ్ర ప్రభావానికి గురవుతున్నది. చాలా మందికి విద్య ఒక పార్ట్‌ టైమ్‌ వ్యాపకంగా మారింది.
 

                                                                            పార్ట్‌ టైమ్‌ విద్య

కరోనా మహమ్మారి వలన పాఠశాలల్లో చదువు మానేసే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌.ఎఫ్‌.ఐ) ఒత్తిడి మేరకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా సంస్థలను పాక్షికంగా పున:ప్రారంభించాయి. కానీ కరోనా మూడో దశ...విద్యా సంస్థలను మళ్ళీ మూసివేసే అవకాశాన్ని కల్పించింది. ఆన్‌లైన్‌ విద్యా విధానం విద్యార్థులపై ప్రతికూల ప్రభావాలను కలిగించిన ఫలితంగా అనేక మంది విద్యార్థులకు ఆన్‌లైన్‌ గేమ్స్‌ బాగా అలవాటయ్యాయి. అదే స్థాయిలో సామాజిక మాధ్యమాన్ని ఉపయోగించడం కూడా బాగా పెరిగింది. ఇప్పుడున్న ''అభ్యసన నష్టం'' సుదీర్ఘ కాలంపాటు కొనసాగుతుందని, అభ్యసనంలో మరియు మానసిక ఆరోగ్య స్థితిని పొందడంలో, వ్యాక్సినేషన్‌, మధ్యాహ్న భోజన పథకాలను ఉపయోగించుకోవడంలో విద్యార్థులకు ఇబ్బందులు వుంటాయని ''యునిసెఫ్‌'' పేర్కొంది. విద్యార్థులు అనేక మంది తమ కుటుంబాలు జీవనాధారాలను కోల్పోవడం వల్ల రోజువారీ కూలీలుగా పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు చదువుకునే అమ్మాయిలకు కూడా పెళ్లిళ్లు చేశారు.
విద్యకు కేంద్రీకరణ, ప్రైవేటీకరణలు మూల స్తంభాలుగా... కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది. ప్రస్తుతం విద్య పౌరులకు హక్కుగా కాకుండా సరుకుగా మారింది. కరోనా మహమ్మారి, లాక్‌డౌన్లు...అభ్యసనంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునే విద్యను అనుసరించడానికి కేంద్ర ప్రభుత్వానికి సహాయపడ్డాయి. ఇలాంటి విద్య కోసం ప్రవేశించే ప్రతీ దశలో భారీగా ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. కానీ రోజువారీ కూలీలుగా జీవనం సాగించే కుటుంబాల విద్యార్థులు తరగతి గదులపై ఆధారపడి మాత్రమే అభ్యసనం చేస్తారు. పుండు మీద కారం చల్లిన చందంగా ప్రస్తుత యూనియన్‌ ప్రభుత్వ బడ్జెట్‌, జాతీయ విద్యా విధానాన్ని సమర్థిస్తూ, ఆన్‌లైన్‌ బోధనకు ప్రాధాన్యత ఇచ్చింది. భారతీయ విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యలో అభ్యసనం పొందే అవకాశాలు కల్పించే ''డిజిటల్‌ యూనివర్శిటీ''ని ఏర్పాటు చేస్తామని కేంద్ర బడ్జెట్లో వాగ్దానం చేశారు. ఈ డిజిటల్‌ అభ్యసనం ఉన్నత విద్యా వ్యవస్థలో ప్రైవేటీకరణ, కేంద్రీకరణకు ద్వారాలు తెరిచే అవకాశాలు కల్పిస్తుంది. ఇలాంటి విద్యా వ్యవస్థలలో అణగారిన వర్గాలకు చెందిన విద్యార్థులు ప్రవేశించే అవకాశాలు సన్నగిల్లుతాయి.
    సమ్మిళిత విద్యా విధానం కోసం యు.జి.సి చేస్తున్న ప్రయత్నం కార్పొరేట్‌ సంస్థలను ప్రోత్సహిస్తుంది. కరోనా మహమ్మారి, వరుస లాక్‌డౌన్ల కారణంగా విద్యా సంస్థలన్నీ మూతపడినపుడు అభ్యసనం, బోధనలు ఎక్కువగా డిజిటల్‌ విద్యా విధానంలోనే జరిగాయి. దేశంలోని 3/4 వంతుల మంది పాఠశాల విద్యార్థులు గడచిన రెండు సంవత్సరాల కాలంలో ఎటువంటి ఆన్‌లైన్‌ తరగతులకు హాజరుకాలేకపోయారు. అత్యంత పేదరికంలో ఉన్న విద్యార్థులు తమ చదువులను కొనసాగించలేక పోయారు. ఒకవైపు చైనా విద్య ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ముందుకు పోతుంటే, మరోవైపు భారతదేశంలో ఆన్‌లైన్‌ విద్యా వేదికలు, విద్యా రంగం ప్రైవేటీకరణ, డిజిటల్‌ విభజన అత్యంత వేగంగా పెరుగుతున్నాయి. స్మార్ట్‌ ఫోన్లు, లాప్‌టాప్‌లు లేదా ఇంటర్నెట్‌ కనెక్షన్‌ లేని విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మొబైల్‌ డేటా ధరల పెరుగుదలతో పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారింది.
ఎస్‌.ఎఫ్‌.ఐ పత్రిక ''ఇండియన్‌ రిసెర్చర్‌'' ప్రకారం దూర విద్య ప్రోగ్రామ్‌ల పరిస్థితి కూడా చాలా ఘోరంగా ఉంది. డిజిటల్‌ అంతరం బాల కార్మిక వ్యవస్థను అనివార్యం చేసింది. డ్రాపౌట్ల సంఖ్యను పరిశీలిస్తే, అమ్మాయిలు ఎక్కువగా ఇంటి పనిలో పాలుపంచుకుంటున్నారు. కేవలం 20 శాతం విద్యార్థులు మాత్రమే ఆన్‌లైన్‌ తరగతులకు హాజరయ్యారనీ, వాస్తవానికి ఆ 20 శాతంలో కూడా కేవలం సగం మంది ఆన్‌లైన్‌లో తరగతులకు హాజరయ్యారని అనేక పరిశోధనా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 37 శాతం గ్రామీణ విద్యార్థులు రోజువారీ చదువులకు పూర్తిగా దూరమయ్యారని మరొక సర్వే తెలిపింది. వారిలో చాలా మంది అక్షరాలు, అంకెలు కూడా రాయలేని స్థితిలో ఉన్నారు.
    ఇప్పుడు విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలను గణనీయంగా మెరుగుపరచాల్సిన అవసరం ఎంతైనా వుంది. కానీ, మోడీ ప్రభుత్వం విద్యా రంగంపై చేసే వ్యయాన్ని 6 శాతం తగ్గించింది. రాష్ట్రాల లోని ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్‌ పాఠశాలల్లో బోధనా సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. అయినప్పటికీ ఉపాధ్యాయ నియామక ప్రక్రియను అలక్ష్యం చేస్తున్నారు. 30 మంది విద్యార్థుల కన్నా తక్కువ ఉన్న పాఠశాలలను మూసివేయాలని జాతీయ విద్యా విధానం సూచిస్తుంది. అయితే భారతదేశంలో 38 శాతం గ్రామాలలో 500 కంటే తక్కువ జనాభా వుంది. ఇలాంటి ప్రాంతాల్లో స్కూళ్లు మూసివేస్తారు. లేదా ఇలాంటి రెండు, మూడు స్కూళ్ళను విలీనం చేస్తారు. ఇది డ్రాపౌట్ల (ముఖ్యంగా బాలికలు) సంఖ్యను పెంచడం తప్ప మరొకటి కాదు.
 

                                                                         గుడ్డు ఏమైంది ?

నేడు దేశమంతా ఇప్పుడు జరుగుతున్న ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల గురించే ఆలోచిస్తుంది. ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల వయసులో పున్న ప్రతీ వెయ్యి మంది పిల్లల్లో 60 మంది చనిపోతున్నారు. భారతదేశంలో చిన్నారుల మరణాల రేటు పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌ దేశాల్లోని పిల్లల మరణాల రేటుకు సమానంగా ఉందని ప్రపంచ బ్యాంకు నివేదిక పేర్కొంది. ఇలాంటి డ్రాపౌట్ల సంఖ్య పెరుగుదల సమస్యను ఎదుర్కొంటున్న సమయంలో, మధ్యాహ్న భోజన పథకం, అంగన్వాడీ పథకాలు చాలా ఉపయోగకరంగా ఉండేవి. కానీ ప్రభుత్వం మధ్యాహ్న భోజన సేవల్లో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య విధానాలను (పిపిపి) ప్రవేశపెట్టే ప్రయత్నాలు చేస్తుంది. ప్రస్తుత బడ్జెట్లో ఇంత ముఖ్యమైన రంగానికి చాలా తక్కువ బడ్జెట్‌ కేటాయించారు. ఒకవేళ పిపిపి విధానం అమలు జరిగితే 'ఇస్కాన్‌, ఆక్షయపాత్ర' లాంటి సంస్థలే ఆ ఒప్పందాన్ని సొంతం చేసుకుంటాయి. ఈ సంస్థలు శాఖాహారానికి ప్రాధాన్యతనిస్తూ, పిల్లల పౌష్టికాహారాన్ని నిర్లక్ష్యం చేస్తాయి. ఒక అంచనా ప్రకారం ప్రాథమిక విద్యనభ్యసించే విద్యార్థికి రోజుకు రూ.4.97 పైసలు, ప్రాథమికోన్నత విద్యార్థికి రూ.7.45 పైసలు కేటాయిస్తున్నారు. ఇంత కొద్దిపాటి కేటాయింపులతో పౌష్టికాహారాన్ని అందించడం చాలా కష్టమైన పని. అనేక బిజెపి పాలిత రాష్ట్రాలు మధ్యాహ్న భోజన పథకాన్ని మత సంస్థలతో కలసి నిర్వహిస్తున్నాయి. అక్కడ విద్యార్థులకు కోడిగుడ్డు, ఇతర మాంసాహారాన్ని నిలిపివేశారు.
 

                                                                             విద్యా రుణాలు

విద్యా రంగానికి నిధులు కేటాయించడానికి బదులుగా కేంద్రం విద్యార్థులకు విద్యా రుణాల అవకాశాలు కల్పించడానికే ఎక్కువ ఆసక్తి చూపుతుంది. పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం విద్యార్థి క్రెడిట్‌ కార్డు పథకాన్ని ప్రారంభించింది. ఇలాంటి పథకాలను ప్రవేశపెట్టడం ద్వారా తమ ఫీజులను పెంచుకునే ప్రైవేటు విద్యా సంస్థలను ప్రోత్సహిస్తుంది. నేడు విద్య అనేది ఖర్చుతో కూడుకున్న అంశంగా మారుతుంది. ఈ కరోనా మహమ్మారి సృష్టించిన అననుకూల పరిస్థితుల్లో తమ చదువులను కొనసాగించేందుకు అనేకమంది విద్యార్థులు పార్ట్‌టైమ్‌గా రకరకాల పనులు చేస్తున్నారు. విద్యకు నిధులు కేటాయించాలి. రుణాలకు బదులుగా ఫెలోషిప్‌లు ఇవ్వాలి. పి.హెచ్‌.డి పూర్తి చేసిన విద్యార్థులు కూడా వివిధ కళాశాలల్లో కాంట్రాక్ట్‌ పద్ధతిలో పని చేస్తున్నారు. యువతకు ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమవడంతో రుణ సౌకర్యాల కల్పన అనేది విద్యార్థులను చిక్కుల్లో పడేయడం తప్ప మరొకటి కాదు.
     రెండు సంవత్సరాల లాక్‌డౌన్‌, రెండు సంవత్సరాల పాటు విద్యా సంస్థలు ఆఫ్‌లైన్‌ విద్యా విధానాన్ని నిలిపేసిన తరువాత సంభవించిన సంక్షోభ నివారణ చర్యలు 2022-23 బడ్జెట్‌లో ప్రతిబింబిస్తాయని ప్రతీ ఒక్కరూ ఆశించారు. కానీ దానికి బదులుగా నూతన జాతీయ విద్యా విధానం ప్రకారమే కేటాయింపులు జరిగాయి. మొత్తం కేటాయింపుల్లో అతి తక్కువగా 3 శాతం మాత్రమే (రూ.103 కోట్లు) పాఠశాల, ఉన్నత విద్యా శాఖలకు కేటాయించారు.
    విద్యా సంస్థలు తెరిచే క్రమంలో కోవిడ్‌ నిబంధనలు పాటించాలి. సాధ్యమైనంత వరకు 100 శాతం విద్యార్థులకు వ్యాక్సిన్‌ వేయించే చర్యలు చేపట్టాలి. కళాశాల, పాఠశాల ప్రాంగణాలను ప్రతీరోజూ శానిటైజ్‌ చేయించి, విద్యార్థులకు మాస్కులు పంపిణీ చేయాలి. అంగన్వాడీ కార్యకర్తలను, తల్లిదండ్రులను భాగస్వామ్యం చేస్తూ మధ్యాహ్న భోజన పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి. అణగారిన వర్గాలకు చెందిన చిన్నారులు చదువుకు దూరం కాకుండా ప్రభుత్వ రవాణా వ్యవస్థలో విద్యార్థులకు రాయితీలు ఇవ్వాలని, ఫీజులను రద్దు చేయాలని, ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజులను తగ్గించాలని, సీట్ల సంఖ్యను పెంచాలని డిమాండ్‌ చేస్తూ పెద్ద ఎత్తున ఉద్యమించడానికి ఎస్‌.ఎఫ్‌.ఐ సన్నద్ధమవుతోంది.

/ వ్యాసకర్త : ఎస్‌.ఎఫ్‌.ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి /
మయూఖ్‌ బిస్వాస్‌

మయూఖ్‌ బిస్వాస్‌