Aug 06,2023 21:17

విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతున్న ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు పండు

ప్రజాశక్తి - గుమ్మలక్ష్మీపురం : ఆశ్రమపాఠశాలల్లో ప్రహరీగోడలు నిర్మిం చి విద్యార్థుల ప్రాణాలలు కాపాడాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు డి.పండు డిమాండ్‌ చేశారు. మండలంలోని టిక్కబాయి ఆశ్రమ పాఠశాలను ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఆదివారం సందర్శించారు. అక్కడి పరిస్థితులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డి.పండు మాట్లాడుతూ గిరిజన విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. అమ్మ ఒడి కింద ఇస్తున్న రూ.15000లో ప్రభుత్వం పాఠశాల అభివృద్ధి కోసం రూ.2వేలు ఉపయోగిస్తామని, కోత పెట్టిన ఆ నిధులతో ఎక్కడా మౌలిక వసతులు కల్పించ లేదన్నారు. నాడు-నేడు పనులు ప్రారంభిం చలేదని, ప్రహరీ గోడలు, తరగతి గదులు, వసతి గృహాల్లేవని అన్నారు. ఇలా సగం సగం అభివృద్ధి చేసిన పాఠశాలల్లో వసతి గృహంలో విద్యార్థులు ఎలా చదవాలని, ఎలా ఉండాలని ప్రశ్నించారు. పాఠశాలలో కిటికీలకు మెస్‌లు లేకపోవడంతో ఆరిక సిద్ధు పాముకాటుకు గురయ్యాడన్నారు. ప్రహరీ గోడ పూర్తిస్థాయిలో లేకపోవడం వల్లే విద్యార్థికి నష్టం జరిగిందని అన్నారు. ఇప్పటికైనా గిరిజన విద్యార్థుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, లేకుంటే ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యాన జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అలాగే సిద్దుకు ప్రభుత్వమే మెరుగైన వైద్యం అందించాలని, ఆశ్రమ పాఠశాలలో వారానికి ఒకసారి మెడికల్‌ చెక్‌అప్‌ చేయాలని, ఆరోగ్య కార్యకర్తలను నియమించాలని, మందులు అందుబాటులో ఉంచాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో కురుపాం, గుమ్మలక్ష్మీపురం మండలాల ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్షులు ఎం.అన్నాజీ, ఎ.గంగారావు, స్థానిక విద్యార్థులు పాల్గొన్నారు.