
విద్యార్థుల మేథోశక్తి అపూర్వం: టీటీడీ ఛైర్మన్
ప్రజాశక్తి- తిరుపతి టౌన్: విద్యార్థుల మేథోశక్తి అపూర్వమైనదని, ఇప్పటి విద్యార్థుల ఆలోచనా స్పీడ్, షార్ప్ చాలా వేగవంతంగా ఉన్నాయని టిటిడి ఛైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుపతి స్మార్ట్ సిటి కార్పొరేషన్, తిరుపతి మున్సిపాల్టీ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ డే సందర్భంగా మంగళవారం కచ్చపి ఆడిటోరియంలో నిర్వహించిన తిరుపతి స్మార్ట్ క్విజ్ గ్రాండ్ ఫైనల్ క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గెలుపొందిన విద్యార్థులకు ముఖ్యఅతిథిగా హాజరైన భూమన బహుమతులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లోని మేథోశక్తిని పెంపొందించేందుకు ఇలాంటి క్విజ్ పోటీలు మరిన్ని అవసరమన్నారు. నేటి పోటీ పరిస్థితుల నేపథ్యంలో కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కు ఇలాంటి క్విజ్ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు ఎంతో చక్కగా రానిస్తారని పేర్కొన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ, స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన కచ్చఫి ఆడిటోరియంలో నిర్వహించిన అతిమంచి రెండవ కార్యక్రమం ఈ క్విజ్ పోటీల నిర్వహణ అని, కమిషనర్ హరిత ఆధ్వర్యంలో చాలా చక్కని కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని అభినందనలు తెలియజేశారు. తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ఎండి, సిఈఓ, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత మాట్లాడుతూ భవిషత్తు తరాలకు నేటి విద్యార్థులే దిక్సుచీలని, విద్యార్థుల్లోని తెలివి తేటలు పొంపొందాలనే లక్ష్యంతో తిరుపతి నగరంలోని 110 స్కూళ్ళ నుండి నలుగురు విద్యార్థులు ఒక టీమ్‌గా 440 మంది పోటీపడగా అందులో 8 టీములను సెలెక్ట్ చేయడం జరిగిందన్నారు. మంగళవారం చిల్డ్రన్స్ డే సందర్భంగా తుది పోటీల్లో మొదటి స్థానాన్ని శ్రీవెంకటేశ్వర చిల్డ్రన్స్ హైస్కూల్ విద్యార్థులు కైవసం చేసుకొని లక్ష రూపాయాల బహుమతిని పొందడం జరిగిందన్నారు. రెండవ స్థానాన్ని కిరణ్ ఇంగ్లీషు మీడియం స్కూల్ విద్యార్థులు కైవసం చేసుకొని రూ.50 వేల, రూ.25 వేల మూడవ బహుమతిగా అట్లాంటీస్ దివరల్డ్ స్కూల్ పొందడం జరిగిందని తెలిపారు. డిప్యూటీ మేయర్ భూమన అభినరు రెడ్డి మాట్లాడుతూ నేటి తరం విద్యార్థుల తెలివితేటలు అమోఘమని, ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని తీసుకురావల్సిన అవసరం ఉందని, అంతకుమునుపు ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం పాల్గొని విద్యార్థులను అభినందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సంగీతం, ఆధ్యాత్మిక డాన్స్ కార్యక్రమాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, ఎస్‌ఈ మోహన్, స్మార్ట్ సిటీ జిఎం చంద్రమౌళీ, ఎంఈలు చంద్రశేఖర్, వెంకట్రామిరెడ్డి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్వేష్ రెడ్డి, ఆర్వో సేతుమాధవ్, మేనేజర్ చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.