Jul 18,2023 21:55

విద్యార్థుల హక్కులను కాలరాసే ఉత్తర్వులనువెనక్కి తీసుకోవాలి

 కడప అర్బన్‌ : ప్రజాస్వామ్య హాక్కులను కాలరాసేలా, విద్యార్థులు నిరసన కార్యక్రమాలలో పాల్గొనకూడదని జిల్లా విద్యాశాఖ అధికారి రాఘవరెడ్డి జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని విద్యార్థి యువజన సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. మంగ ళవారం డిఇఒ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి సగిలి రాజేంద్ర ప్రసాద్‌, ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షులు పవన్‌, యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర కార్యదర్శి తిరుమలేసు, టిఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు భారత్‌, ఎన్‌ఎస్‌యుఐ జిల్లా అధ్యక్షులు మామిళ్ల బాబు, పిఎస్‌యు జిల్లా కార్యదర్శి నాగేంద్ర, డివైఎఫ్‌ఐ నగర అధ్యక్షులు షాకీర్‌, ఎఐవైఎఫ్‌ నాయకులు మైనుద్దీన్‌ మాట్లాడారు. విద్యార్థులు తమ సమస్యలపై పోరాడేందుకు వీలు లేకుండా ప్రజాస్వామ్య హక్కులను కాలరాసేలా ర్యాలీలు, ధర్నాలో పాల్గొనకూడదని డిఇఒ ఇచ్చిన ఉత్త ర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య హక్కులకోసం, ప్రజాస్వామ్య బద్దంగా ఆందోళన తెలిపే ప్రతి పౌరునికీ ఉందన్నారు. విద్యార్థుల హక్కుల కోసం వారి సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులు పోరాటాలు చేసేందుకు వీలు లేదని చెప్పడం డిఇఒ నిరంకు శత్వానికి నిదర్శనమని తెలిపారు. డిఇఒ ప్రభుత్వ అధికారిగా కాకుండా అధికార పార్టీ నాయకులుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఎన్నికలు దగ్గర ఉండటం వల్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు పోరాటాలు చేయకూడదని వైసిపి ప్రభుత్వానికి అనుకూలంగా డిఇఒ ఉత్తర్వులు జారీ చేశారని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అన్నమయ్య జిల్లా విద్యాశాఖాధికారిగా కొనసాగుతున్న ఈ డిఇఒ ప్రభుత్వం పట్ల తన భక్తిని చాటుకున్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కడప జిల్లాలో సర్క్యులర్‌ జారీ చేయడం వెనుక మతలబు ఏంటని, ఎవరి మెప్పు కోసం డిఇఒ తాపత్రయమని వారు ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించకుండా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకుండా సమస్యలపై పోరాటాల్లో విద్యార్థులు భాగస్వామ్యం కావద్దని అలా కాకుండా ర్యాలీ, ధర్నాలల్లో విద్యార్థులు పాల్గొంటే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని ఉత్తర్వులుజారీ చేయడం సిగ్గు చేటని వారు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా గుర్తింపు లేని విద్యాసంస్థలు నడుస్తున్నా, ప్రయివేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో విచ్చలవిడిగా అధిక ఫీజులు వసూలు చేసి దోపిడి చేస్తున్నా చర్యలు తీసుకోలేని డిఇఒ విద్యార్థులను మాత్రం ర్యాలీలు, ధర్నాలలో పాల్గొనకూడదని ఆదేశాలు ఇవ్వడం విడ్డురంగా ఉందన్నారు. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖాధికారి తను జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షలు ఎం.ఆర్‌.నాయక్‌, ఉపాధ్యక్షులు గండి సునీల్‌ కుమార్‌, పవన్‌ కల్యాణ్‌, డివైఎఫ్‌ఐ నాయకులు రెబ్బ నరసింహులు, పిఎస్‌యు నాయకులు గోపి పాల్గొన్నారు.