ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి : చదువుతూ పోరాడు... చదువుకై పోరాడు అన్న నినాదంతో సాగిన ఎస్‌ఎఫ్‌ఐ సైకిల్ యాత్ర జిల్లాలో పది రోజుల పాటు సాగింది. గత నెల 31న ప్రారంభమైన యాత్ర 9వ తేదీ వరకు జిల్లాను చుట్టుముట్టింది. ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాలు, ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీల్లో అనేక సమస్యలను ఎస్‌ఎఫ్‌ఐ బృందం అధ్యయనం చేసింది. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాలకు వెళ్లిన నాయకులు, కార్యకర్తలకు విద్యార్థులు అఖండ స్వాగతం పలికారు. రోజూ వేలాది మంది యాత్రలో భాగస్వామ్యమవుతూ తమ సమస్యలను నాయకుల ఎదుట ఏకరువుపెడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. యాత్ర చివరి రోజు ఈనె 9వ తేదీన జిల్లా కేంద్రంలో భారీ ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా యాత్రలో గుర్తించిన సమస్యలను, విద్యార్థుల ఆవేదనను ప్రభుత్వం, ముఖ్యంగా జిల్లాకు చెందిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని కూడా రాష్ట్ర నాయకులు హెచ్చరించారు. సంక్షేమ హాస్టళ్లలో మెస్ ఛార్జీలు చాలా తక్కువగా ఉన్నాయి. దీనికితోడు ఆరు నెలలుగా ఛార్జీలు చెల్లించకపోవడంతో నిర్వాహకులు ఆర్థిక ఇబ్బందుల నడుమ నెట్టుకొస్తున్నారు. చాలా చోట్ల అద్దె భవనాల్లో హాస్టళ్లు నడుస్తున్నాయి. దీంతో, విద్యార్థులు తాగునీరు, మరుగుదొడ్లు వంటి కనీస మౌలిక సదుపాయాలకు కూడా నోచుకోలేదు. ప్రతి వార్డెన్ 2 నుంచి 3 హాస్టళ్లకు ఇన్‌ఛార్జి బాధ్యతలు నిర్వహించడంతో విద్యార్థుల ఆలన పాలన, భద్రత ప్రశ్నార్థకంగా మారింది. దాదాపు అన్ని జూనియర్ కాలేజీల్లోనూ అధ్యాపకులు పూర్తి స్థాయిలో లేరు. ఇప్పటికీ పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు ఇవ్వలేదు. గతంలోవున్న మధ్యాహ్నం భోజన పథకాన్ని ప్రభుత్వం తొలగించడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో నాడు-నేడు నిధులు ఎటు పోతున్నాయో అంటూ జనంలో చర్చ నడుస్తోంది. అధ్యాపకులు, పాధ్యాయులు, పాఠ్యపుస్తకాలు పూర్తిస్థాయిలో లేకుండా చదువులెలా సాగుతాయని కూడా ప్రశ్నిస్తున్నారు. దత్తిరాజేరు, మెరకముడిదాంలలో రెండేళ్ల క్రితం మంజూరు చేసిన జూనియర్ కాలేజీలకు ఇప్పటికే సొంత భవనాలు లేవు. అధ్యాపకులు అరకొరగానే ఉన్నారు. దీంతో, హాస్టళ్ల మాదిరిగానే మరుగుదొడ్లు, తాగునీటి సమస్య వెంటాడుతోంది. భోగాపురం, మెంటాడ, బొండపల్లిలో జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. గ్రీన్ ఫీల్డ్ హైవేలో భాగంగా ఎస్.కోట మండలం బొద్దాం జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలలోని కొన్ని భవనాలు తొలగించిన సంగతి తెలిసిందే. వాటికి సంబంధించి కొత్తగా నిర్మాణణాలు చేపట్టకపోవడంతో ఉన్నత కొద్దిపాటి గదుల్లోనే విద్యార్థులకు షిఫ్టులవారీగా తరగతులు నిర్వహిస్తున్నారు. ఎస్.కోట, గజపతినగరం డిగ్రీ కాలేజీలకు సొంత భవనాలు లేకపోవడంతో కనీస సదుపాయాలు కూడా గగన మయ్యాయి. అధ్యాపకులు కూడా పూర్తిస్థాయిలో లేకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు గురౌతున్నారు. కేంద్రీయ గిరిజన యూనివర్శీటికీ కూడా సొంత భవనం లేకపోవడం వల్ల తరగతులు ఒకచోట, ప్రయోగాలు మరోచోట, హాస్టల్ ఇంకోచోట నడుస్తున్నాయి. దీనికితోడు జిల్లాలో పిజి క్యాంపస్ ఒక్కటంటే ఒక్కటి కూడా లేకపోవడం పట్ల యాత్రలో పాల్గొన్న ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర నాయకులు విస్తుపోయారు. మెజార్టీ హాస్టళ్లు, స్కూళ్లు, కాలేజీలలో కనీస సదుపాయాలు లేకపోవడం, ఉపాధ్యాయులు, అద్యాపకులు సరిపడినంత మంది లేకపోవడంతో నాడు - నేడు నిధులు ఏమౌతున్నాయో అన్న అనుమానాలు విద్యార్థులు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులల్లో వ్యక్తమౌతోంది. ఇప్పటికైనా అధికారులు కల్లు తెరిచి సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కోరుతున్నారు. లేదంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.










