Aug 17,2023 21:40

విద్యార్థులతో మాట్లాడుతున్న డిఐఒ జగన్మోహన్‌రావు

ప్రజాశక్తి - కొమరాడ : వసతిగృహ విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి (డిఐఒ) డాక్టర్‌ టి.జగన్మోహనరావు అన్నారు. ఈ మేరకు ఆయన పెదఖేర్జిలో ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలను గురువారం సందర్శించారు. విద్యార్థుల ఆరోగ్య వివరాల నమోదు, రికార్డులను పరిశీలించారు. గతంలో నిర్వహించిన హీమోగ్లోబిన్‌, రక్త పరీక్షలు ఫలితాలను పరిశీలించి రక్తహీనతగా గుర్తించిన విద్యార్థులకు ప్రత్యేకంగా పర్యవేక్షణ చేశారు. ప్రస్తుతం ఏ మేరకు హీమోగ్లోబిన్‌ శాతం వృద్ధి చెందినదనే విషయమై వైద్య సిబ్బందిచే వారికి పరీక్షలు చేయించారు. రక్తహీనత ఉన్న విద్యార్థులకు వైద్య సిబ్బంది, వసతి గృహ సిబ్బంది ఎటువంటి చర్యలు చేపడుతున్నారని ఆరా తీశారు. ప్రతి రోజూ ఐరన్‌ ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలు వేయించాలని, పౌష్ఠికాహారం అందించాలని సూచించారు. అలాగే హీమోగ్లోబిన్‌ శాతం సాధారణంగా ఉన్న విద్యార్థులకు వారానికి ఒకసారి ఐరన్‌ ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలు వేయించాలన్నారు. అనంతరం ఆయన సిక్‌ రూమ్‌లో ఉన్న విద్యార్థుల ఆరోగ్య పరిశీలన చేశారు. విద్యార్థులతో మాట్లాడి వారి అనారోగ్య సమస్యలను అడిగి ప్రస్తుతం ఏ మేరకు కోలుకున్నారో పరిశీలించారు. అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని సిబ్బందికి సూచించారు. ఆల్బెండజోల్‌ మాత్రలు విద్యార్థులందరికీ వేయించినదీ తెలుసుకున్నారు. అలాగే పలువురు విద్యార్థుల ఆరోగ్య పరిశీలన చేశారు.
దోమల నివారణ చర్యలు
సీజనల్‌ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో వాటికి కారణమైన దోమల వ్యాప్తిని నివారించే దిశగా చర్యలు తప్పనిసరి అని డిఐఒ జగన్మోహనరావు అన్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఎం పురం గ్రామ చెరువులో గంబూషియా చేపలను వైద్య సిబ్బంది విడిచి పెట్టే కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఇవి దోమల లార్వాలను తిని వేస్తాయని తద్వారా మలేరియా, డెంగీ జ్వరాలకు కారణమైన దోమల నివారణకు సాధ్యమవుతుందన్నారు. అదేవిధంగా ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవా లన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్‌ సిహెచ్‌.అరుణ్‌కుమార్‌, ఉపాధ్యాయ సిబ్బంది సీతారాం, రాజారావు, సూపర్‌ వైజర్‌ జయగౌడ్‌, వైద్య సిబ్బంది మంగమ్మ, అనిల్‌,రమేష్‌, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.