Mar 26,2023 00:21

విద్యార్థుల ఆరోగ్యం అందరి బాధ్యత

ప్రజాశక్తి-పాడేరు టౌన్‌: గిరిజన విద్యార్థుల ఆరోగ్యాన్ని రక్షించే బాధ్యత అందరిపైనా ఉందని ఐటిడిఎ పిఒ రోణంకి గోపాలక్రిష్ణ స్పష్టం చేసారు. టిడబ్ల్యూ డిడి ఐ.కొండలరావు శుక్రవారం సాయంత్రం ఐటిడిఎ సమావేశ మందిరంలో వివిధ సంఘాల నాయకులు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, విద్యార్థి సంఘాల లీడర్లతో ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్ధుల ఆరోగ్య రక్షణ, మరణాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వైద్య సదుపాయాలు, పోషకాహరాలు సరఫరాపై సమావేశం నిర్వహించి పలు సూచనలు, సలహాలు స్వీకరించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఐటిడిఎ పిఒ మాట్లాడుతూ ఇటీవల పాఠశాలల్లో జరుగుతున్న విద్యార్థుల మరణాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు. జువైనల్‌ జస్టిస్‌ ఆదేశాల మేరకు పాఠశాలల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆశ్రమాల్లో మెనూ అమలు, భద్రతా చర్యలు, విద్య, వైద్య సేవలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. ఐటిడిఎలో కమాండ్‌ కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, భవిష్యత్తులో మరింత విస్తరిస్తామని తెలిపారు. ప్రతీ నెలా 20 - 25 తేదీల మధ్యలో ఆశ్రమ పాఠశాలలు వసతి గృహాలలో విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి వైద్య సేవలు అందించడం జరుగుతోందన్నారు. తీవ్రమైన వ్యాదులకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి జిల్లా ఆసుపత్రి పాడేరు, అరకు వ్యాలీ, చింతపల్లి ఏరియా ఆసుపత్రులలోను, ముంచంగిపుట్టు సామాజిక ఆసుపత్రులలో స్టూడెంట్‌ హెల్త్‌ సెల్‌ ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. సికిల్సెల్‌ ఎనిమియాను గుర్తించడానికి 54,730 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. వీరిలో 2,963 మందికి సోలబిలిటీ టెస్టులు చేయడం జరిగిందన్నారు. 15 మంది సికిల్‌ సెల్‌ ఎనిమియాతో బాధపడుతున్న విద్యార్థులను గుర్తించి మెరుగైన వైద్యం అందించడంతో పాటు పింఛన్లు అందించడానికి అవసరమై చర్యలు చేపట్టామని చెప్పారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే అనే పుస్తకాన్ని అన్ని ఆశ్రమ పాఠశాలలకు పంపిణీ చేసామని దీనిపై సంబంధిత ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు అవగాహన ఉండాలన్నారు. పాఠశాలలు, వసతి గృహాలలో సంఘాల సూచలను అమలు చేసే విధంగా సర్క్యులర్‌ జారీ చేయాలని టిడబ్ల్యూ డిడికి ఆదేశాలు జారీ చేసారు. ఈ సమావేశంలో ఎడిఎంహెచ్‌ఒ జమాల్‌ బాషా, జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్‌ క్రిష్ణారావు, ఎటిడబ్ల్యూఒలు ఎల్‌.వెంకటరమణ, క్రాంతి కుమార్‌, మల్లిఖార్జున, , ఉపాధ్యాయ సంఘాల నేతలు, పేరెంట్స్‌ కమిటీ సభ్యులు, జిఎస్‌యు లీడర్లు, పలువురు ఎన్‌జిఒల ప్రతినిధులు పాల్గొన్నారు.