Aug 24,2023 20:19

ప్రజాశక్తి - ఏలూరు
           ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యతిస్తున్నామని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ గంటా పద్మశ్రీ అన్నారు. సత్రంపాడులోని జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ను గురువారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి, పాఠశాల తరగతులు, విద్యాబోధన, పారిశుధ్యం, మరుగుదొడ్ల నిర్వహణ, వైద్య సిబ్బంది విద్యార్థులకు నిర్వహిస్తున్న ఆరోగ్య పరీక్షలను పరిశీలించారు. ఈ సందర్భంగా పద్మశ్రీ మాట్లాడుతూ విద్యద్వారానే పేదరిక నిర్మూలన సాధ్యమని నమ్మిన సిఎం జగన్‌ విద్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతిస్తున్నారని, ఏటా విద్యారంగానికి రూ.వేలాది కోట్లు కేటాయిస్తున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలలో నాడు-నేడు కార్యక్రమం ద్వారా కార్పొరేట్‌ స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించిందన్నారు. ఇంగ్లీష్‌ మీడియం, డిజిటల్‌ తరగతి గదుల ఏర్పాటు, గుణాత్మక విద్యపై ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ అందించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాల స్థాయిని మరింత పెంచామన్నారు. ప్రభుత్వం చేపట్టిన పనులతో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరిగాయన్నారు. అమ్మఒడి ద్వారా విద్యార్థుల తల్లులకు ఆర్థికసాయం, జగనన్న విద్యా కానుక ద్వారా పాఠ్య, నోట్‌ పుస్తకాలు, బ్యాగులు, యూనిఫారాలు, బూట్లు ఉచితంగా అందిస్తున్నారని, జగనన్న గోరుముద్ద ద్వారా విద్యార్థులకు పూర్తిస్థాయిలో పౌష్టికాహారం అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే విద్యార్థులకు వైద్య సిబ్బందిచే ప్రతీ మూడు నెలలకు ఒకసారి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, రక్తహీనత, దృష్టిలోపం వంటి సమస్యలకు వెంటనే చికిత్స చేసి, మందులు అందిస్తున్నారన్నారు. విద్యార్థులకు రక్తహీనత నివారణ మాత్రలను జెడ్‌పి చైర్‌పర్సన్‌ స్వయంగా వేశారు. అనంతరం పాఠశాలల్లోని టాయిలెట్ల నిర్వహణ ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శైలజ, పేరెంట్స్‌ కమిటీ ఛైర్మన్‌ విజేష్‌, వైసిపి బిసి సెల్‌ జిల్లా అధ్యక్షులు గంటా ప్రసాదరావు పాల్గొన్నారు.