
ప్రజాశక్తి-అమలాపురం రూరల్ విద్యార్థుల్లో సృజనాత్మకంగా ఉండే శాస్త్రీయమైన ఆలోచనలకు పదును పెట్టినప్పుడు అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చునని డిఇఒ ఎం.కమల కుమారి పేర్కొన్నారు. గురువారం సమనసలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో 31వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ ఉత్సాహంగా సాగింది. జిల్లా సైన్స్ అధికారి జివిఎస్.సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ శాస్త్రవేత్త కెఎస్‌ఎన్.రావు, డిఇఒ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఇఒ కమల కుమారి మాట్లాడుతూ జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి నమోదు చేసుకున్న 205 ప్రాజెక్టుల నుంచి 105 ప్రాజెక్టులను జిల్లా స్థాయికి ఎంపిక చేసినట్టు చెప్పారు. వినూత్నమైన ఆలోచనలతో సమాజానికి ఉపయోగపడే విధంగా అనేక రకాల సామాజిక పర్యావరణ సమస్యలకు చక్కటి పరిష్కారాలను ప్రాజెక్టుల రూపంలో విద్యార్థులు ప్రదర్శించారన్నారు. మాజీ శాస్త్రవేత్త కెఎస్‌ఎన్.రావు మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి శాస్త్రవేత్తలుగా మారడానికి చక్కటి అవకాశాలు ఇస్తుందని, జిల్లా నుంచి అనేక ప్రాజెక్టులు జాతీయస్థాయిలో కూడా మంచి విజయాలు సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. సమగ్ర శిక్ష కమ్యూనిటీ మొబలైజేషన్ ఆఫీసర్ బివివి.సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ జిల్లా స్థాయిలో అనేక ప్రాజెక్టులు ఇటీవల జాతీయస్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించడం గర్వకారణమని, అదే ఒరవడిని కొనసాగించాలని తెలిపారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ ఎన్.మనోవిహార్ మాట్లాడుతూ జిల్లా విద్యాశాఖ చేసే వినూత్న ఆలోచనలతో కూడిన వైజ్ఞానిక కార్యక్రమాలకు తమ తోడ్పాటు ఎప్పుడూ ఉంటుందని తెలియజేశారు. జిల్లా సైన్స్ అధికారి జివిఎస్.సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఈ నెల 29, 30 తేదీల్లో విజయవాడ కెఎల్.యూనివర్సిటీలో నిర్వహించే రాష్ట్రస్థాయి బాలల సైన్స్ కాంగ్రెస్‌కు జిల్లా నుంచి ఏడు ప్రాజెక్టులు ఎంపిక చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఎఫ్‌ఎఒ ప్రవీణ్, వెంకటేశ్వరరావు, బళ్ల ఆదినారాయణ, బ్రహ్మానందం పాల్గొన్నారు.