Nov 21,2023 20:55

వసతి, విద్యాదీవెనకు విద్యార్థి, తల్లి ఉమ్మడి బ్యాంకు ఖాతా నిబంధన
నాలుగున్నరేళ్లు గడిచాక ప్రభుత్వం కొత్త మెలిక పెట్టడంపై విమర్శలు
కాలేజీలకు వెళ్లడం మాని బ్యాంకుల చుట్టూ విద్యార్థుల ప్రదక్షిణలు
ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 65,547 మంది విద్యార్థుల అవస్థలు
విద్యార్థులంతా రావడంతో బ్యాంకు పాస్‌బుక్‌కు మూడు రోజులకుపైగా సమయం
దూర ప్రాంత విద్యార్థుల అవస్థలు వర్ణనాతీతం
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

ప్రభుత్వం విద్యార్థులను ముప్పుతిప్పలు పెడుతోంది. వసతి, విద్యాదీవెన సొమ్ము జమపై కొత్త మెలిక పెట్టింది. ప్రభుత్వం ఇప్పటి వరకూ తల్లుల ఖాతాల్లో ఈ పథకం సొమ్మును జమ చేస్తోంది. ఇప్పుడు హఠాత్తుగా తల్లి, విద్యార్థి ఉమ్మడి ఖాతా ఉండాలనే నిబంధన విధించింది. ఈ నెల 28న వసతిదీవెన సొమ్ము జమ చేయాల్సి ఉండగా రెండు వారాల ముందు ఈ నిర్ణయం ప్రకటించి ఈ నెల 24వ తేదీకి ఉమ్మడి బ్యాంకు ఖాతా పాస్‌బుక్‌ జిరాక్స్‌ కాపీ సచివాలయాల్లో ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఒక్కసారిగా విద్యార్థులంతా చదువులు వదిలి సొంత గ్రామాలకు పరుగులు తీస్తున్నారు. దూరప్రాంత విద్యార్థుల అవస్థలు వర్ణనాతీతం. విద్యార్థులంతా ఒక్కసారిగా బ్యాంకులకు చేరడంతో ఏ బ్యాంకు చూసినా కిటకిటలాడుతోంది. ఉదయం వెళ్తే సాయంంత్రానికి కూడా పని పూర్తవడం గగనంగా మారింది. ఒకేసారి విద్యార్థులు బ్యాంకు ఖాతాలు తెరవడంతో పాస్‌బుక్‌లు ఇచ్చేందుకు బ్యాంకులు మూడు రోజులకుపైగా సమయం తీసుకుంటున్న పరిస్థితి ఏర్పడింది. దీంతో విద్యార్థులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. ఏలూరు జిల్లాలో వసతిదీవెన అందుకుంటున్న విద్యార్థులు 32,316 మంది ఉన్నారు. వీరికి ఈ ఏడాది తొలివిడత సొమ్మును ఏప్రిల్‌ 27వ తేదీన విడుదల చేశారు. ఏలూరు జిల్లాలోని విద్యార్థులకు రూ.30.96 కోట్లు సొమ్ము విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లాలో 33,231 మంది విద్యార్థులకు వసతిదీవెన కింద రూ.31.69 కోట్లు జమ చేశారు. విద్యాదీవెన అందుకునే విద్యార్థులు రెండు జిల్లాల్లో 63,867 మంది ఉన్నారు. వీరంతా ఇప్పుడు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. అంటే నాలుగు నెలలు మాత్రమే ప్రస్తుత ప్రభుత్వ పాలనా కాలం ఉంది. ఎన్నికల తర్వాత ఏ ప్రభుత్వం ఏర్పడుతుందో ఇప్పుడేమీ చెప్పలేం. నాలుగు నెలల కాలానికి విద్యార్థులను ఈ విధంగా ఇబ్బంది పెట్టడం ఏమిటని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థులైతే ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడెక్కడో చదువుకుంటున్న విద్యార్థులు సైతం ఉమ్మడి బ్యాంకు ఖాతా తెరిచేందుకు సొంత గ్రామాలకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. చదువులు అటకెక్కడంతోపాటు ఛార్జీల రూపంలో రూ.వేలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. కొత్తగా తెరిచే తల్లి, విద్యార్థి ఉమ్మడి బ్యాంకు ఖాతాకు ఎటిఎం కార్డుగాని, నెట్‌బ్యాంకింగ్‌ సౌకర్యం ఉండకూడదని ప్రభుత్వం నిబంధన పెట్టింది. సొమ్ము జమైన తర్వాత కూడా విద్యార్థులు వస్తే తప్ప బ్యాంకు ఖాతా నుంచి సొమ్ము తీసుకోలేని పరిస్థితి కొనసాగనుంది. ప్రభుత్వం తీసుకుంటున్న అర్థంపర్థం లేని నిర్ణయాలతో విద్యార్థులు సతమతమవుతున్నారు. తొలుత డిగ్రీ, ఇంజినీరింగ్‌ వంటి విద్య అభ్యసిస్తున్న మొదటి సంవత్సరం విద్యార్థుల నుంచి నాలుగో సంవత్సరానికి చేరిన విద్యార్థులంతా బ్యాంకు ఖాతా తెరవాలని తెలిపారు. దీంతో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఖాతాలు తెరిచిన తర్వాత ఇప్పుడు అవసరం లేదన్నట్లు మాట్లాడటంపై విద్యార్థుల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం విద్యార్థులను ఇబ్బందిపెట్టడం వెనుక ఓట్ల రాజకీయం ఉందనే విమర్శలు విన్పిస్తున్నాయి. ఈ నెల 24వ తేదీకి ఖాతా తెరవలేకపోయిన విద్యార్థుల పరిస్థితి ఏమిటో అర్థంకాని పరిస్థితి నెలకొంది.