Nov 17,2023 21:45

ఎస్‌ఓపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు

         ప్రజాశక్తి-శింగనమల   విద్యార్థినులు అర్ధాకలితో అలమటిస్తున్నా పట్టించుకోరా అంటూ సమగ్ర శిక్ష స్టేట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు స్థానిక కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల ఎస్‌ఒపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం మండల కేంద్రంలోని కెజిబివిని సమగ్ర శిక్ష స్టేట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా రికార్డులు సరిగా లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. అనంతరం భోజనాన్ని తనిఖీ చేసి నాణ్యతగా లేకపోవడంతో ఈ భోజనాన్ని విద్యార్థినులు ఎలా తింటారని ఎస్‌ఓను ప్రశ్నించారు. అయితే రెగ్యులర్‌ వర్కర్లు రాలేదని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత ఆర్‌ఒ వాటర్‌ప్లాంట్‌ను పరిశీలించగా పని చేయకపోవడంతో ఎందుకు పనిచేయలేదని ప్రశ్నించారు. అదేవిధంగా స్టోర్‌ రూమ్‌ను పరిశీలించగా కూరగాయలు నాణ్యతగా లేకపోవడంతో ఎస్‌ఓను మందలించారు. దీంతో ఎస్‌ఒ స్పందిస్తూ ఇక్కడ సిబ్బంది సమస్య ఉందని, తానే ఉద్యోగానికి రాజీనామా చేయాలని అనుకుంటున్నానని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో.. 'నువ్వు రాజీనామా చేయాలనుకుంటే చెరు.. ఎందుకు నన్ను బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నావ్‌..' అంటూ మండిపడ్డారు. అనంతరం సిబ్బందితో సమావేశం నిర్వహించి పలు సూచనలు, సలహాలను ఇచ్చారు. మళ్లీ నెల తర్వాత వస్తానని, అప్పటిలోపు లోపాలు సరిదిద్దుకోవాలని ఎస్‌ఓను ఆదేశించారు. అరకొరగా అన్నం పెట్టడంతోపాటు ఎవరైనా నిలదీస్తే టిసి ఇచ్చి పంపుతానని బెదిరింపులకు గురి చేయడం మంచిది కాదన్నారు. అనంతరం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంలో సమయం అవుతున్నా విద్యార్థులు తరగతి గదుల బయట తిరుగుతుండడాన్ని గమనించి విద్యార్థులను పిలిచి ఎందుకు బయట ఉన్నారని ప్రశ్నించడంతో టీచర్‌ సెలవు పెట్టిందని సమాదాణం ఇచ్చారు. దీంతో హాజరు పట్టికను పరిశీలించి ఎక్కువ మంది సెలవులో ఉండడాన్ని గమనించి అందరికీ ఒకేసారి లీవులు ఎలా ఇస్తారని అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అనంతరం విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఆయన వెంట ఎఎంఓ చంద్రశేఖర్‌రెడ్డి, సీఎమ్‌ఓ వేణుగోపాల్‌, ఎంఈఓ నరసింహారాజు తదితరులు పాల్గొన్నారు.